నంద్యాల బ్యూరో, ఫిబ్రవరి 8 : మహా కుంభమేళాకు వెళ్ళే నంద్యాల జిల్లా భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పిందని, జిల్లాలోని డోన్, కర్నూలు రైల్వే స్టేషన్ మీదుగా మహా కుంభమేళా కోసం వెళ్ళే భక్తులకు స్పెషల్ రైళ్ల సౌకర్యం దక్షిణ మధ్య రైల్వే కల్పించిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.
శనివారం ఎంపీ మాట్లాడుతూ.. ట్రెయిన్ నెంబర్ 07117/07118 తిరుపతి – దానపూర్ – తిరుపతి రైలు నంద్యాల జిల్లాలోని డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ఈనెల 15వ తేది శనివారం 6:30 కు బయలుదేరి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కి 16వ తేది ఆదివారం రోజు సాయంత్రం 5:30 గంటలకు చేరుకుంటుందని, అనంతరం మళ్ళీ తిరుగు ప్రయాణంలో 17వ తేది సోమవారం రాత్రి 8:30 గంటలకు ప్రయాగరాజ్ లో బయల్దేరి డోన్ జంక్షన్ కి 19వ తేది బుధవారం ఉదయం 5:45 గంటలకు చేరుకుంటుందని, ఈ రైలు కర్నూలు, కాచిగూడ, నాగపూర్ మార్గంలో ప్రయాగరాజ్ కు వెళ్తుందని ఎంపీ వివరించారు. ఇదే రైలు కర్నూలు మీదుగా వెళ్తుందని, కాబట్టి నంద్యాల వాసులు కర్నూలు నుంచి కూడా ప్రయాణం చెయ్యవచ్చునని ఆమె తెలిపారు. నంద్యాల జిల్లా నుంచి మహాకుంభమేళాకు వెళ్లే భక్తులు ఈ రైలును ఉపయోగించుకోవాలని ఎంపీ శబరి కోరారు.