Vizag Steel Plant | భారీ ప్రమాదం.. 8మంది మృతి

Vizag Steel Plant | భారీ ప్రమాదం.. 8మంది మృతి

భారీగా లీకైన ఉక్కు ద్రవం..

Vizag Steel Plant | విశాఖ‌ప‌ట్నం బ్యూరో, ఆంధ్రప్రభ : విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ఆధ్వర్యంలోని విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ మెల్టింగ్ షాప్-2 (ఎస్‌ఎంఎస్-2) పరిధిలోని ఎస్‌టీసీ-3 హీట్ ఎఫ్‌జీ వద్ద భారీ మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

కరిగిన ఉక్కు ద్రవాన్ని తరలించే ప్రక్రియలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. లాడెన్ నుంచి ద్రవ ఉక్కు నేలపై పడడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈప్రమాదంలో 8మంది మృతిచెందగా, పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ప్ర‌మాదంలో ఎంత‌మందికి గాయాల‌య్యాయ‌నే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Vizag Steel Plant |
Vizag Steel Plant |

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో కార్మికులు మృతి చెందిన విషయం తెలిసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సీఎం, ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదం అనంతరం అక్కడి పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సహాయక చర్యల పురోగతి, క్షతగాత్రుల పరిస్థితి, వైద్య సేవలపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు.

గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

అలాగే ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని, సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురావాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా పరిశీలించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా సూచించినట్లు సమాచారం.

ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు ఇవి:

  • రావూరి మల్లికార్జున రావు
  • పల్లెల శ్రీనివాస్
  • అర్జున అప్పారావు
  • సత్యనంద్
  • సూరిబాబు
  • పైడిరాజు

వైద్యుల పర్యవేక్షణలో క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది. వారి ఆరోగ్య పరిస్థితిపై అధికారులు నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు.

Leave a Reply