జక్కా జడ్సన్ అరెస్ట్ అన్యాయం…

- వెంటనే విడుదల చేయాలి..
- పెన్షనర్స్ డిమాండ్
కరీమాబాద్, (ఆంధ్రప్రభ) : సామాజికవేత్త జక్కా జడ్సన్ అరెస్టును స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జిపిఎటి) రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు తీవ్రంగా ఖండించారు. 2024 మార్చి నుండి ఇప్పటివరకు రిటైర్ అయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు న్యాయంగా రావలసిన పెన్షనరీ బకాయిలు ఇప్పటికీ ప్రభుత్వం నుండి విడుదల కాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై అక్టోబర్ 27న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు వందలాది పెన్షనర్లతో ధర్నాలు చేసి, కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి పత్రాలు పంపించినప్పటికీ ఎటువంటి స్పందన లేదని తెలిపారు. నవంబర్ 17న పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్-ధర్నా చౌక్ వద్ద వేలాది మంది పెన్షనర్లు పాల్గొన్న మహా ధర్నా అనంతరం కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కొనసాగించడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పెన్షనర్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని గవర్నర్‌కి విజ్ఞప్తి చేసేందుకు సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన జడ్సన్‌ను శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేసినట్లు ఎస్‌జిపిఎటి నాయకులు ఆరోపించారు. అటువంటి చర్య ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, నీచమైనదని వారు ఖండించారు.
బక్క జడ్సన్‌ను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని ఎస్‌జిపిఎటి రాష్ట్ర అధ్యక్షుడు ఎ. రాజేంద్రబాబు, ప్రధాన కార్యదర్శి ఎం.వి. నర్సింగరావు, అదనపు ప్రధాన కార్యదర్శి వెలిశోజు రామమనోహర్, ఆర్థిక కార్యదర్శి బి. నర్సయ్య తదితరులు డిమాండ్ చేశారు.
