AP | ఇస్కాన్ టెంపుల్ ద‌గ్ధం – ద‌ర్యాప్తున‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశం

మంగ‌ళ‌గిరి : శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండల పరిధిలోని కూర్మ గ్రామంలోని ఇస్కాన్ ( (ISKCON) రాధాకృష్ణ మందిరం (Radhakrishna Temple) కొన్నిరోజుల కిందట జరిగిన అగ్నిప్రమాదంలో (Fire Accident ) పూర్తిగా కాలిపోయింది. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా దుండగులు ఉద్దేశపూర్వకంగా నిప్పుపెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి దుశ్చర్యలు జరిగాయని మందిర నిర్వాహకుల్లో ఒకరైన ప్రభుదాస్ పోలీసులకు వివరించారు.

ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నేడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదం దురదృష్టకరమ‌ని పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి, నిజానిజాలు నిగ్గు తేల్చాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.

“ఆధునిక హంగులు లేకుండా అధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న కూర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరం. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) హిరమండలం సమీపంలోని కూర్మ గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై పోలీసులు లోతుగా విచారణ చేయాలని సంబంధిత యంత్రాంగానికి సూచనలు చేశాను. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలి. కూర్మ గ్రామం (Kurma village) లో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాము. సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పాటైంది. కూర్మ గ్రామవాసులు యాంత్రిక జీవన విధానాలకు భిన్నంగా మట్టి ఇళ్ళల్లో ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేసుకొంటూ జీవిస్తున్నారు. వేద విద్యను అభ్యసించే చిన్నారులు సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. వర్తమాన కాలంలో విశిష్టంగా ఉన్న ఈ గ్రామం పునరుద్ధరణపై దృష్టి సారించాలి” అని పవన్ స్పష్టం చేశారు.

Leave a Reply