దీపిక మరణం దురదృష్టకరం

దీపిక మరణం దురదృష్టకరం

ఆమె ప్రతిభావంతురాలు

ఆత్మహత్య అనుమానం

ఆధారాలతో నిగ్గుతేలుస్తాం

ఆమె కుటుంబానికి అండగా ఉంటాం

న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం

ఏపీ మహిళాకమిషన్​ చైర్ పర్సన్​

( ఆంధ్రప్రభ, విజయవాడ )

బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటాం.  పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా  చర్యలు తీసుకుంటాం అని  ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. మెడికో దీపిక మృతి చెందిన  ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ శుక్రవారం  విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, ఘటనకు వివరాలను అధికారులను, తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియా ప్రతినిధులతో చైర్ పర్సన్ మాట్లాడుతూ..  మెడికో దీపిక మృతి చెందడం చాలా దురధృష్టకరమని, ఈ విషయంలో వారి కుటుంబ సభ్యులకు మహిళా కమిషన్ అండగా నిలుస్తుందన్నారు.

దీపిక చాలా మెరిట్​ స్టూడెంట్​

బాధితురాలు గత మూడేళ్లుగా ఇక్కడే చదువుతోందని, ఆమె ప్రవర్తనలో ఏవైనా మార్పులు వచ్చాయా లేదా ఏదైనా ఒత్తిడి ఉందా అనే కోణంలో తోటి విద్యార్థులు, సహచర డాక్టర్లతో చైర్‌ పర్సన్ వ్యక్తిగతంగా మాట్లాడారు. దీపిక చాలా ప్రతిభావంతురాలని, ఆమె ప్రవర్తనలో ఎలాంటి అసాధారణ మార్పులు లేవని విద్యార్థులు తెలిపారన్నారు. ​మృతదేహంపై ఉన్న ‘పంక్చర్ మార్క్స్’ (సూది గుర్తులు) దేనివల్ల వచ్చాయనేది తేలాల్సి ఉందని చైర్‌పర్సన్ పేర్కొన్నారు. నమూనాలను (Tissues) బయాప్సీ, ఎఫ్ఎస్ఎల్ పరీక్షల కోసం పంపామని, ఈ నివేదికలు రావడానికి రెండు నుండి మూడు వారాల సమయం పడుతుందని అధికారులు వివరించారన్నారు.

విషప్రయోగం కాదు

ఆహారం వల్ల విషప్రయోగం జరిగి ఉండవచ్చనే అనుమానాలను ఆమె తోసిపుచ్చారు. దీపికతో కలిసి భోజనం చేసిన మరో జూనియర్ డాక్టర్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వాంతుల నివారణకు వాడే ‘ఆండన్సెట్రాన్’ ఇంజెక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోందని వివరించారు. ​కేసు దర్యాప్తులో భాగంగా కాల్ డేటా రికార్డ్స్ (CDR), పోస్ట్‌మార్టం నివేదికల కోసం వేచి చూస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఆధారాలు లభిస్తాయి

​ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చిన తర్వాతే ఇది ఆత్మహత్యా లేక ఇతర కారణాలా అనేది స్పష్టమవుతుందన్నారు. బాధితురాలి కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చైర్ పర్సన్  రాయపాటి శైలజ పేర్కొన్నారు. చైర్ పర్సన్ విజిట్ లో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ఆలపాటి ఏడుకొండలరావు,  ఆర్ఎంవోలు ఉన్నారు..