గుజరాత్ పై ఘన విజయం

గుజరాత్ పై ఘన విజయం
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
ధర్మశాల వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-1 పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో బెంగళూరు జట్టు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జట్టు భారీ స్కోరుకు పునాది వేశారు. విరాట్ కోహ్లీ, దేవదూత్ పడిక్కల్ రాణించడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది.
255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే తడబడింది. బెంగళూరు బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. జాకబ్ డఫీ మూడు వికెట్లతో చెలరేగగా, రసిఖ్ సలామ్, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా తలా రెండు వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించారు. గుజరాత్ జట్టులో రాహుల్ తెవాటియా (68) మినహా మరెవరూ నిలకడగా ఆడకపోవడంతో, ఆ జట్టు 162 పరుగులకే కుప్పకూలింది.
ఈ గెలుపుతో ఆర్సీబీ నేరుగా ఫైనల్స్‌లోకి అడుగుపెట్టగా, పరాజయం పాలైన గుజరాత్ టైటాన్స్ ఈ నెల 29న జరగనున్న క్వాలిఫైయర్-2లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
