ఎన్టీఆర్ అక్షరాల్లో 20 సినిమా చిత్రాలు..

ఎన్టీఆర్ అక్షరాల్లో 20 సినిమా చిత్రాలు..
మహానాడు సందర్భంగా వినూత్న చిత్రాంజలి
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మహానాడు పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ప్రముఖ చిత్రకారుడు, కళారత్న చింతలపల్లె కోటేష్ వినూత్నంగా చిత్రాంజలి సమర్పించారు.
కేవలం 8 అంగుళాల పొడవు, 14 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్‌పై “NTR” అక్షరాల్లో ఎన్టీఆర్ నటించిన 20 సినిమాలకు సంబంధించిన పాత్రలను సూక్ష్మంగా చిత్రించారు. మైక్రో పెన్ను, మైక్రో బ్రష్‌లతో వాటర్ కలర్ ఉపయోగించి ఈ కళాఖండాన్ని సుమారు నాలుగు గంటల్లో పూర్తి చేశారు.

ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ నందమూరి తారకరామారావును ప్రజలు ప్రేమగా ఎన్టీఆర్, అన్నగా పిలుచుకుంటారని తెలిపారు. “ఎన్ అంటే నందమూరి, టి అంటే తారక, ఆర్ అంటే రామారావు”గా ఆయన పేరు వెనుక ఉన్న భావాన్ని కళాత్మకంగా చూపించినట్లు వివరించారు.
ఎన్టీఆర్ జీవితంలోని బాల్యం, సినీ ప్రస్థానం, రాజకీయ జీవితం ఇలా అన్ని దశలను ప్రతిబింబించేలా చిత్రాలు రూపొందించినట్లు చెప్పారు. సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రల్లో బ్రహ్మనాయుడు, శ్రీకృష్ణదేవరాయలు, అక్బర్, పోతులూరి వీరబ్రహ్మం, శివుడు, భీష్ముడు, భీముడు, శ్రీకృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, వెంకటేశ్వర స్వామి వంటి పాత్రలను ప్రత్యేకంగా చిత్రించినట్లు తెలిపారు.
పౌరాణిక పాత్రల్లో ప్రపంచంలోనే అత్యంత విభిన్న పాత్రలు చేసిన నటుడు ఎన్టీఆర్ అని, అందుకే ఆయనను “విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు”గా పిలుస్తారని అన్నారు. సినీ రంగం, రాజకీయ రంగం రెండింటిలోనూ ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఎన్టీఆర్ సేవలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రతి జయంతి, వర్ధంతికి వినూత్న చిత్రాల ద్వారా నివాళులు అర్పిస్తానని కోటేష్ చెప్పారు.
