ఇంద్రకీలాద్రి పై సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం

ఇంద్రకీలాద్రి పై సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారణ జన్ముడు. తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. సుబ్రహ్మణ్య ఆరాధన వలన మానవులకు శక్తి యుక్తులు సమకూరుతాయిని విశ్వాసం. సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య స్వామి ఆధీనంలో ఉంటారని, అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోందని పురాణోక్తి. షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం జరిపించడం, వీక్షించడం వలన అవివాహితులకు వివాహ సంబంధ ఆటంకాలు తొలగి వివాహాలు జరిగి, సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.

విశిష్టమైన ఇంద్రకీలాద్రి క్షేత్రంలో షష్టి రోజున సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించిన వారికి సత్సంతాన ప్రాప్తి, రాబోయే తరాలవారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల విశ్వాసం. షష్టిని పురస్కరించుకుని శనివారం మంగళవాయిద్యములు, వేదపండితుల మంత్రోచ్చారణాల నడుమ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల కళ్యాణం శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది. ఈ సేవలో ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వికె శీనా నాయక్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు పూజలో పాల్గొని, శ్రీ వల్లీ దేవసేన సమేత స్వామివార్ల కళ్యాణం తిలకించారు.