భక్తజన సంద్రమైన కొండపై వెలుగు..

భక్తజన సంద్రమైన కొండపై వెలుగు..

ఇంద్రకీలాద్రిలో రద్దీకి ప్రత్యేక ఏర్పాట్లు..

విజయవాడ, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. వేసవి సెలవులు, వారాంతపు విరామం కలిసిరావడంతో తెల్లవారుజామున నుంచే కొండపై భక్తుల రద్దీ పెరిగింది.

శనివారం సుమారు 56 వేలకు పైగా భక్తులు దర్శించుకోగా, ఆదివారం మధ్యాహ్నం వరకు 40 వేలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎండల తీవ్రత ఉన్నప్పటికీ భక్తుల రాక తగ్గలేదు.

భారీ రద్దీ నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆలయ అధికారులు ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని వీఐపీ దర్శనాలను రద్దు చేశారు.

ఈ నిర్ణయంతో సాధారణ భక్తులకు వేగంగా దర్శనం లభించింది. క్యూ లైన్లు క్రమబద్ధంగా కొనసాగాయి.

ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీరు అందించారు. ఈ ఏర్పాట్లు భక్తులకు ఉపశమనం కలిగించాయి.

అదేవిధంగా ఆలయ పరిసరాల్లో ఉచిత అన్నదానం, ప్రసాద పంపిణీ నిరంతరాయంగా కొనసాగింది.

భారీ రద్దీ మధ్య దేవస్థానం చైర్మన్ బుర్ర గాంధీ స్వయంగా క్యూ లైన్లలో పర్యటించి భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఇన్‌చార్జ్ ఈవోతో పాటు సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.

మధ్యాహ్నం తర్వాత రద్దీ క్రమంగా తగ్గినా, ఉదయం నుంచి కొండపై భక్తుల రద్దీ కొనసాగింది. ఎండల్లోనూ చల్లని నీరు, అన్నదానం, సులభ దర్శన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a Reply