చంద్రబాబు హామీలపై వైసీపీ నిరసన గళం
చంద్రబాబు హామీలపై వైసీపీ నిరసన గళం
- టీడీపీ మేనిఫెస్టో దహనం చేసి ఆందోళన
- ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు
- వైసిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
- జూన్ 8న టౌన్ హాల్ లో సమావేశం, 12న భారీ ర్యాలీ చేస్తాం
విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు విజయవాడలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మేనిఫెస్టో ప్రతులను, పార్టీ జెండాలను దహనం చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనమని పేర్కొన్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆసరా, చేయూత, ఇంటి స్థలాలు వంటి సంక్షేమ పథకాలు అమలు చేశామని, అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 50 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ సహా విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చి ప్రజలకు సేవలు అందించామని, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, ఇళ్ల పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం విద్యుత్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మరింత ఉధృతంగా పోరాటాలు చేపడతామని పేర్కొన్న అవినాష్, జూన్ 8న టౌన్ హాల్ సమావేశం, జూన్ 12న జిల్లా స్థాయిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
