నేత్రపర్వంగా ముగిసిన వసంతోత్సవాలు..
నేత్రపర్వంగా ముగిసిన వసంతోత్సవాలు..
పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం..
9 రోజులు పుష్పార్చన…
ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వైభవం…
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో గత తొమ్మిది రోజులుగా వైభవంగా నిర్వహించిన వసంత నవరాత్రి మహోత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ముగిశాయి. చైత్ర శుద్ధ దశమి పురస్కరించుకుని శనివారం వసంత నవరాత్రుల పూర్ణాహుతి, ఉత్సవ సమాప్తి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. నవరాత్రుల చివరి రోజైన నేడు నూతన పూజా మందిరంలో ఉదయం నుంచే అమ్మవారికి కనకాంబరములు, గులాబీలతో విశేష పుష్పార్చన సేవ నిర్వహించారు.

దేవస్థానం చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో శీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు, వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా కొనసాగాయి. పాత యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంతో వసంత నవరాత్రి ఉత్సవాలు ముగిసినట్లు వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో పుష్పార్చనను అత్యంత వైభవంగా నిర్వహించగా ఇంద్రకీలాద్రిపై సరికొత్త ఆధ్యాత్మిక వాతావరణం వెళ్లి విరిసింది.

