అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ కూటమి ప్రభుత్వం..
- కోట్ల రూపాయల నిధులతో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి.
- 2, 3, 4, 5 డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
- కొండ ప్రాంత ప్రజలకు త్వరలో ఇళ్ల పట్టాల రెగ్యులరైజేషన్ శుభవార్త
- గుణదల రైల్వే స్టేషన్ ప్రారంభానికి సన్నాహాలు.. రెండు ఆర్వోబీలు త్వరలో ప్రారంభం
- కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విజయవాడ అభివృద్ధికి ప్రాధాన్యం
- విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని..
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 2, 3, 4, 5 డివిజన్లలో రూ.14 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను మంజూరు చేయించేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తూ వస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రతి డివిజన్‌లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు త్వరలో శుభవార్త అందనున్నదని పేర్కొన్న ఎంపీ, అక్కడి ఇళ్ల పట్టాలను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టబోతోందని వెల్లడించారు. దీని ద్వారా ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని, వారి చిరకాల కోరికను కూటమి ప్రభుత్వం నెరవేర్చబోతోందని అన్నారు.
రాయనపాడు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పూర్తై ప్రజలకు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో విజయవాడ ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌లో గుణదల రైల్వే స్టేషన్‌ను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే విజయవాడలో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.

విజయవాడ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాయని, గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ఈ ప్రాంత అభివృద్ధిపై తగిన దృష్టి పెట్టలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడకు భారీ ఎత్తున నిధులు మంజూరవుతున్నాయని, నగరాన్ని ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, హైకోర్టు అడ్వకేట్ ఎర్నేని వేదవ్యాస్, దేవానంద్, ముమ్మినేని ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు గాబ్రియల్, బచ్చలకూరి అజయ్‌కుమార్, సుగసాని రత్న శ్రీకృష్ణ ప్రసాద్, బాబూరావు, నర్రా సుబ్బారావు, శ్యాంప్రసాద్ నాగభూషణం, కిషోర్, షరీఫ్, ఆంజనేయులు, భీమేశ్వరరావు, వంశీకృష్ణ, పూర్ణ, సుధాకర్, కొండ నాగశేషు, నాగూర్, దిలీప్, గణేష్ నాగదుర్గ తదితరులు పాల్గొన్నారు.
