రేపటి నుంచే ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్..
హైదరాబాద్ (ఆంధ్రప్రభ) : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో, ప్రైవేట్ కాలేజీలు రేపటి నుంచే నిరవధిక బంద్‌కు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.900 కోట్ల నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు.. నవంబర్ 4న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి రిప్రజెంటేషన్ సమర్పించనున్నారు. నవంబర్ 6న లక్షమంది అధ్యాపకులు, సిబ్బంది, స్టాఫ్‌తో భారీ సభ నిర్వహించనున్నారు. అనంతరం నవంబర్ 10న పది లక్షల మంది విద్యార్థులతో “చలో సెక్రటేరియట్” లాంగ్ మార్చ్ చేపట్టాలని నిర్ణయించారు.
ప్రభుత్వం స్పందించకుంటే, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించే దిశగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సమాఖ్య నాయకులు హెచ్చరించారు.
ఇదిలా ఉంటే, విద్యా సంస్థలపై తనిఖీలు చేయాలని విజిలెన్స్ దాడులను ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సమాఖ్య తీవ్రంగా విమర్శలు గుప్పించింది. “ఈ బెదిరింపులకు భయపడబోము… మా హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం” అని సమాఖ్య స్పష్టం చేసింది.
