Narayanapet | భారీ దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం…

Narayanapet | భారీ దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం…
Narayanapet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భగత్‌సింగ్ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ప్రైవేట్ ఇన్సూరెన్స్(Private Insurance) కంపెనీలకు నిధుల బదిలీ, సిఎస్సి హెల్త్ టెస్టుల పేరుతో భారీ దుర్వినియోగంపై సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుచి కిరణ్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల ప్రమాద మృతి, సహజ మృతి, శాశ్వత–పాక్షిక అంగవైకల్యం పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయాలని జూలై 22, 2025న విడుదల చేసిన జీఓ 12ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీఓ విడుదలైన రెండు రోజులకే క్రెడిట్ యాక్సిస్ లైఫ్(Credit Axis Life), ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలకు మొత్తం రూ.340 కోట్లు అక్రమంగా బదిలీ చేశారని ఆరోపించారు. అదేవిధంగా సీఎస్సీ హెల్త్ టెస్టుల పేరుతో వెల్ఫేర్ బోర్డు నిధులలో సుమారు రూ.500 కోట్లు దుర్వినియోగం చేశారని టీయూసిఐ నాయకులు విమర్శించారు.
అవసరం లేని టెస్టులు నిర్వహించి ఒక్కో కార్మికుడి టెస్ట్‌కు రూ.3,250 వసూలు చేస్తూ కార్మికులను బలవంతంగా పరీక్షలకు హాజరు చేస్తున్నారని పేర్కొన్నారు. టెస్టుల్లో తప్పులు, డాక్టర్ కన్సల్టేషన్(Doctor Consultation) లేకపోవడం, మందుల ఖర్చు కార్మికులపై పడటం వంటి సమస్యలను వివరించారు. ఈ అక్రమాలపై తక్షణ చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ నవంబర్ 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం(Collector’s Office) ముందు ధర్నా, మండల కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, పట్టణంలో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బీ. నరసింహ, సహాయ కార్యదర్శులు ఏ. నరసింహ, కనకరాయుడు, నాయకులు చెన్నప్ప, డీ. నరసింహ, నాగేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
