ప్రజాస్వామ్య వ్యవస్థపై పెరుగుతున్న దాడులు..

- బీజేపీ చొరవతో ఉసిగల్పుతున్న ఆర్‌ఎస్‌ఎస్..
- లౌకికవాదులు ప్రశ్నించాల్సిందే…
- విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వల్లూరు భార్గవ్
విజయవాడ, ఆంధ్రప్రభ : మతాల మధ్య చిచ్చు, రాష్ట్రాల మధ్య చీలిక, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడులు ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులని విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వల్లూరు భార్గవ్ అన్నారు. దేశాన్ని ఏకం చేసిన మహానాయకుల విగ్రహాల పక్కనే, దేశాన్ని విభజన, ద్రోహం, ద్వేష రాజకీయాల వైపు నెట్టిన ఆర్‌ఎస్‌ఎస్–మోడీ పాలనకు ప్రతీకగా ఒక విభజన ద్రోహి విగ్రహాన్ని కూడా దేశంలో ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఇటువంటి సంఘటనలు ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ పాలనకు వారసత్వంగా కొనసాగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని యువత, భవిష్యత్ తరాలు నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశాన్ని నిర్మించినవారెవరో, దేశాన్ని విభజించినవారెవరో చరిత్రలో స్పష్టంగా నమోదు చేయాలన్నారు. ఇది ద్వేషానికి కాదు, చరిత్ర ద్వారా ఇచ్చే హెచ్చరిక అని తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో క్రిస్మస్ పండుగ వేడుకలు జరుపుకుంటున్న వారిని అడ్డుకోవడం, క్రిస్మస్‌కు సంబంధించిన వస్తువులు విక్రయిస్తున్న వారిని కూడా అడ్డగించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి సంఘటనలను దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు అందరూ కలిసి ఇలాంటి ఘటనలను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశ గౌరవాన్ని కాపాడాలంటే ప్రతి పౌరుడి నమ్మకాలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు.
