పల్నాడు జిల్లా “దేశం” రథ సారధిగా మళ్లీ “కొమ్మాలపాటి”కే అవకాశం…!

  • ఫైనల్ చేసిన అధిష్టానం….!

పల్నాడు బ్యూరో (ఆంధ్రప్రభ) : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ రథసారధిగా పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ కు మళ్లీ అవకాశం దక్కింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 21 మంది సమన్వయకర్తలు, ఏడుగురు శాసనసభ్యుల సూచనలు, సలహాలు మేరకు జిల్లా అధ్యక్ష పదవికి ముగ్గురు పేర్లను పార్టీ అధిష్టానం కు సీల్డ్ కవర్ ద్వారా పంపడం జరిగింది. స్థానిక పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలతో చర్చించి గరిష్టంగా ముగ్గురిని ఎంపిక చేసి వారి పేర్లను మాత్రమే అధిష్టానానికి పంపారు.

మళ్లీ “కొమ్మాలపాటి” కే ఛాన్స్…!

ఇదిలా ఉండగా…. ప్రస్తుతం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న డాక్టర్ కొమ్మలపాటి శ్రీధర్ ను మళ్ళీ రెండో పర్యాయం ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు కసరత్తు జరిగిందని తెలియ వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పెదకూరపాడు అసెంబ్లీ సీటును చంద్రబాబు సూచన మేరకు కొమ్మాలపాటి త్యాగం చేశారు.

అంతేకాదు ఆనాడు జరిగిన ఎన్నికల బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… కొమ్మాలపాటికి ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పిస్తానని బహిరంగ హామీ ఇవ్వడం జరిగింది. దీంతో శ్రీధర్ కు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి పగ్గాలను పార్టీ అధిష్టానం అప్పగించింది. అనూహ్య రీతిలో 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు స్థానంను సైతం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని ఘన విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది.

దీంతో శ్రీధర్ కీర్తి మరింత పెరిగిందని చెప్పవచ్చు. దీంతో ఆయనపై పార్టీ అధిష్టానంకు మరింత నమ్మకం పెరిగింది. 2027లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీధర్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం తద్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో అప్పటివరకు ఆయనను ఈ పదవిలో కొనసాగించేందుకు పార్టీ అధినాయకత్వం ఫైనల్ చేసినట్లు తెలిసింది. అయితే జిల్లాలోని ఎంపీ, ఇన్చార్జి మంత్రితో పాటు ఏడుగురు శాసనసభ్యులు కూడా ఆయనకు మద్దతు ప్రకటించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో పార్టీ అధినాయకత్వం మళ్లీ శ్రీధర్ కు పలనాడు జిల్లా పార్టీ పగ్గాలను భేషరతుగా అప్పగించే సూచనలు స్పష్టంగా ఉన్నాయని తెలుస్తుంది. పార్లమెంటరీ పార్టీ కమిటీల కూర్పుపై త్రిసభ్య కమిటీ బృందం నరసరావుపేటకు చేరుకొని సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

గతంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాష్ట్ర స్థాయి నేత మందలపు రవి హాజరయ్యారు.

జిల్లా కు చెందిన శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, భాష్యం ప్రవీణ్, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాడు శ్రీధర్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, నేతలు, త్రిసభ్య కమిటీతో పాటు పాల్గొని అధ్యక్షుని ఎంపికపై ఒక అభిప్రాయానికి వచ్చారు. విడివిడిగా తమ తమ అభిప్రాయాలను జిల్లా అధ్యక్షులు ఎంపికు కోసం త్రిశభ్య కమిటీకి తెలియజేశారు.

అయితే హాజరైన ఎమ్మెల్యేలు “కొమ్మాలపాటి” పేరును ఏకగ్రీవంగా ఆమోదిస్తూ కమిటీ ముందు ఉంచారు. దీంతో అధిష్టాన నిర్ణయం బుధవారం ప్రకటించవచ్చునని పార్టీ వర్గాల సమాచారం.

Leave a Reply