పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి
- బీసీపీ రాష్ట్ర నాయకులు పి వెంకన్న
కడెం, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను నిరంతరం పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోందని బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు పసుపుల వెంకన్న తీవ్రంగా విమర్శించారు. శనివారం మండల కేంద్రమైన కడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల రక్తాన్ని పిండి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల కేవలం వాహనదారులకే కాదు, సామాన్య ప్రజల జీవితమంతా తీవ్ర ప్రభావానికి గురవుతోందన్నారు.
రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, పేద, మధ్యతరగతి ప్రజలు జీవనం సాగించడం కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు వ్యవసాయ ఖర్చులు పెరిగి పంటలు సాగు చేయడం భారంగా మారిందన్నారు. ఆటో కార్మికులు, చిన్న వ్యాపారులు, కూలీలు, ఉద్యోగులు అందరూ ఈ ధరల పెంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా ప్రజలకు ఎలాంటి ఉపశమనం ఇవ్వకుండా ఎక్సైజ్ సుంకాలు పెంచుతూ ప్రజలను దోచుకుంటోందని వెంకన్న ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్‌పై భారీ పన్నులు విధించి ప్రజల శ్రమను దోపిడీ చేస్తూ కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యంగా మారిందన్నారు. “ప్రజల బాధలు పట్టని మోడీ ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్ పాలన వైపు నెడుతోంది. ఒకవైపు నిరుద్యోగం, మరోవైపు ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర సంక్షోభంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రచార రాజకీయాల్లో మునిగిపోయింది” అని విమర్శించారు. బిసిపి పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలపై విధిస్తున్న అధిక పన్నులను రద్దు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా, ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
