డీఎస్సీపై దమ్ముంటే చర్చకు రండి..!

వైసీపీ నేతలకు విప్ బోండా ఉమా సవాల్‌
లోకేష్‌ చర్చకు సిద్ధమన్నారు..
ముందుకు రాకపోవడం చేతకానితనమే
మెగా డీఎస్సీపై వైసీపీ 220 కేసులు
కోర్టు ఆరోపణలు తిరస్కరించింది
రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ఆందోళనలు..
హద్దులు దాటితే మా శైలిలో సమాధానం ఇస్తాం..
విప్ బోండా ఉమా


(పాయకపురం, ఆంధ్రప్రభ) : డీఎస్సీ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ అరాచకానికి పాల్పడుతోందని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే, విప్ బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. డీఎస్సీపై మంత్రి నారా లోకేష్‌ చర్చకు సిద్ధమని ప్రకటించినా వైసీపీ నేతలు ముందుకు రావడం లేదని విమర్శించారు. బ్రిడ్జి గేమ్‌ కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగమని, దానిని పేకాటతో పోలుస్తూ వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికే లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చిందని, డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఎనిమిది నెలలుగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు వారిని ఇబ్బందులకు గురిచేసేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో యువత భవిష్యత్తుతో ఆడుకున్నారని బోండా ఉమ విమర్శించారు.

మెగా డీఎస్సీ జరగకుండా వైసీపీ 220 కేసులు వేసిందని, అయితే ఆ కేసుల్లో చేసిన ఆరోపణలను కోర్టు ప్రాథమిక స్థాయిలోనే తిరస్కరించిందని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ ప్రక్రియ సక్రమంగా జరిగిందని కోర్టు కూడా ధ్రువీకరించిందన్నారు. ప్రస్తుతం డీఎస్సీ పేరుతో వైసీపీ చేస్తున్న ఆందోళనలు రాజకీయ లబ్ధి కోసమేనని ఆరోపించారు. ముత్యాలంపాడులో రౌడీషీటర్లను తీసుకొచ్చి గొడవలకు పాల్పడ్డారని బోండా ఉమా ఆరోపించారు. వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, దేవినేని అవినాష్‌, మల్లాది విష్ణులు కులం పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కులాల పేర్లను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించవద్దని సూచించారు. తనను, టీడీపీ నాయకులను ఉద్దేశించి వైసీపీ నేతలు హద్దులు దాటి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

కబ్జాలు చేసేది దేవినేని నే…
వైసీపీ నేత దేవినేని అవినాష్‌పై కూడా బోండా ఉమ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అవినాష్‌ కుటుంబ సంపాదనపై, కబ్జాలపై ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై అవినాష్‌ స్పందన వెలువడాల్సి ఉంది. అవినాష్‌, వెల్లంపల్లి కారణంగానే ప్రశాంతంగా ఉన్న సెంట్రల్‌ నియోజకవర్గంలో గొడవలు ప్రారంభమయ్యాయని బోండా ఉమా ఆరోపించారు. దాడులు తమ సంస్కృతి కాదని, గతంలో టీడీపీ కార్యాలయం, పట్టాభి ఇంటిపై దాడులు చేసిన వైసీపీ నేతలే ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. మాచర్ల, గుడివాడ ప్రాంతాల్లో తనపై దాడులు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు.

ధర్నా చౌక్ లోనే ధర్నాలు…
ధర్నాలకు సంబంధించి పోలీసుల అనుమతులపైనా బోండా ఉమా ప్రశ్నలు సంధించారు. ధర్నా చౌక్‌ ఉండగా ఇతర ప్రాంతాల్లో ఆందోళనలకు అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. అవసరమైతే ప్రతి నియోజకవర్గంలోనూ ధర్నా చౌక్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం అభివృద్ధిలో ఎనిమిదో స్థానంలో ఉందని తెలిపారు.

పేర్నివి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
మాజీ మంత్రి పేర్ని నానిపై కూడా బోండా ఉమ తీవ్ర విమర్శలు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. బియ్యం కేసును ప్రస్తావిస్తూ పేర్ని నాని గత వ్యవహారాలపై ఆరోపణలు చేశారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే బందరులోనే సమాధానం చెబుతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై పేర్ని నాని వివరణ ఇవ్వాల్సి ఉంది. వైసీపీ శాంతియుతంగా ఆందోళన చేస్తే తనకు అభ్యంతరం లేదని, హద్దులు దాటి వ్యవహరిస్తే తమ శైలిలో సమాధానం ఇస్తామని బోండా ఉమ హెచ్చరించారు.

తనకు టీడీపీ టికెట్‌ లేదంటూ మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌, దేవినేని అవినాష్‌ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంబటి రాంబాబు రాజకీయంగా తనపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదంటూ వ్యాఖ్యానించారు. చివరగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై తాను చర్చించినట్లు బోండా ఉమ తెలిపారు.