ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల హెచ్చరిక
ఈ నెల 10న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట నిరసనలు
వేతన ఒప్పందం అమలులో జాప్యాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆందోళన
గోదావరిఖని, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ): సింగరేణి బొగ్గు గని కార్మికుల 12వ వేజ్ బోర్డు ఒప్పందం అమలులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 10న సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. కోల్‌బెల్ట్ పరిధిలోని అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాలతో పాటు సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి మాట్లాడారు.
వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ.. 12వ వేజ్ బోర్డు ఒప్పందాన్ని జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్‌ల విధానాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా వేతన ఒప్పందం అమలును ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు.
కోల్ ఇండియాలో గుర్తింపు ఎన్నికలు పూర్తయిన తర్వాతే వేతన ఒప్పందాన్ని అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన సరైనది కాదని ఆయన అన్నారు. గుర్తింపు ఎన్నికల్లో 51 శాతం మద్దతు ఉన్న సంఘంతోనే నిర్ణయాలు తీసుకోవాలన్న నిబంధనను కూడా వ్యతిరేకించారు. కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 12వ వేజ్ బోర్డు ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
10న భారీ ధర్నాలు
12వ వేజ్ బోర్డు అమలులో జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 10న సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. వేతన ఒప్పందం అమలు చేయకపోతే భవిష్యత్తులో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 10న నిర్వహించే ధర్నాల్లో సింగరేణి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులు, వేతన ప్రయోజనాలకు భంగం కలిగించే విధానాలను తాము వ్యతిరేకిస్తామని, 12వ వేజ్ బోర్డు అమలు కోసం సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని రాజిరెడ్డి పేర్కొన్నారు.
సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, నాయకులు గౌతం గోవర్ధన్, దాసరి శ్రీనివాస్, బిట్టి వెంకటేశ్వర్లు, ఏవీఎస్ ప్రకాశ్, రాజేశ్వర్‌రావు, దేవయ్య, కార్యాలయ కార్యదర్శి తొడుపునూరి రమేశ్‌కుమార్, సీఐటీయూ నాయకులు శివరాంరెడ్డి, రాజమౌళి, నరహరిరావు, ప్రవీణ్, ఐఎన్‌టీయూసీ నాయకులు వెంకటేశ్వర్లు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
