హైడ్రా కొలువుల కోసం పోటెత్తిన యువత..
సరూర్‌నగర్‌లో తోపులాట
ఫిజికల్ టెస్టులకు వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు
ఏర్పాట్లు సరిపోక ఇబ్బందులు.. రంగంలోకి దిగిన పోలీసులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైడ్రాలో ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత భారీగా తరలిరావడంతో సరూర్‌నగర్ స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంట్రాక్ట్ పద్ధతిలో 150 పోస్టుల భర్తీకి హైడ్రా నోటిఫికేషన్ జారీ చేయగా.. ఫిజికల్ టెస్టులకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు. దీంతో స్టేడియం వద్ద రద్దీ పెరిగి తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
హైడ్రా భర్తీలో భాగంగా డీఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు 100, హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు 50 చొప్పున మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి అర్హతగా నిర్ణయించగా.. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. డ్రైవర్ పోస్టులకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి సరూర్‌నగర్ స్టేడియంలో శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 50 సెకన్లలో, 100 మీటర్ల పరుగును 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాంగ్‌జంప్‌లో 4 మీటర్ల దూరం దూకాలి. 7.26 కిలోల షాట్‌పుట్‌ను 6 మీటర్ల దూరం విసరాల్సి ఉంటుంది.
ఈ పరీక్షలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు తరలిరావడంతో తెల్లవారుజాము నుంచే స్టేడియం వద్ద రద్దీ నెలకొంది. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రావడంతో ఏర్పాట్లపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రద్దీ నేపథ్యంలో తోపులాట చోటుచేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
ఉద్యోగాల కోసం భారీ సంఖ్యలో యువత పోటీపడుతున్న నేపథ్యంలో హైడ్రా భర్తీ ప్రక్రియకు వచ్చిన స్పందన మరోసారి నిరుద్యోగ సమస్య తీవ్రతను చాటింది.
