బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

మాల సంఘం నాయకులు

అరాచకాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుతాం:
బాధితురాలికి రక్షణ కల్పించాలి..
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామంలో వివాహితపై జరిగిన ఘటనను మాల సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, వారికి ఎలాంటి భయాందోళనలు కలగకుండా ధైర్యం కల్పిస్తామని తెలిపారు.

గ్రామానికి చెందిన వివాహిత ఇంట్లోకి అదే గ్రామానికి చెందిన రంగు చందు అనే యువకుడు నాలుగు రోజుల క్రితం చొరబడి ఆమెను ఇబ్బందులకు గురిచేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు నాయకులు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు.

బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మాల సంఘం నాయకులు స్పష్టం చేశారు. అరాచకాలకు వ్యతిరేకంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఐక్యంగా పోరాటం చేస్తామని తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఆమె కుటుంబానికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు.

నిందితుడిని చట్టప్రకారం వెంటనే అరెస్టు చేసి, కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులకు అవసరమైన రక్షణ కల్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆల్‌ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఈసీ సభ్యుడు, జిల్లా మాల సంఘం నాయకుడు నల్ల శ్యాం, మాల సంఘాల మండల జేఏసీ కన్వీనర్ కడారి రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు జనుప వెంకటేష్, మండల అధ్యక్షుడు పొనగంటి రాజారత్నం, మాజీ అధ్యక్షుడు మ్యాధరి రమేష్, మండల ఉపాధ్యక్షుడు భూపతి, సలహాదారులు జనుప లచ్చన్న, గ్రామ మాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.