నిరుపేదలకు అండగా ప్రజా ప్రభుత్వం
బాధితునికి 6 లక్షల ఎల్ఓసి పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే
ఉట్నూర్, ఆంధ్రప్రభ : నిరుపేదలకు అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఉట్నూర్ మండలం లక్కారం గ్రామానికి చెందిన మహమ్మద్ సల్మాన్‌కు సీఎం సహాయ నిధి ద్వారా రూ.6 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది.
లక్కారం 12వ వార్డు సభ్యురాలు అరికిల్ల గంగామణి, అశోక్ తదితరులు సల్మాన్ అనారోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే బొజ్జుపటేల్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం మంజూరుకు కృషి చేశారు. ఈ మేరకు మంజూరైన రూ.6 లక్షల ఎల్‌ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి బాధితుడికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం పొందడంలో ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సహాయాన్ని అందిస్తోందని తెలిపారు. ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
