ఉపాధి నిధుల కేటాయింపులో వివక్ష తగదు

బీజేపీ నేతల ఆందోళన.. ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల ముట్టడి
ఆర్డీవో కార్యాలయంలోకి దూసుకెళ్లిన పార్టీ శ్రేణులు..
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన ఉద్రిక్తత
అన్ని గ్రామాలు, వార్డులకు సమానంగా నిధులు కేటాయించాలి: గంగిడి మనోహర్‌రెడ్డి

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల కేటాయింపులో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక అధికారులు తీవ్ర వివక్ష చూపుతున్నారని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చౌటుప్పల్ మండలం, పురపాలక సంఘం, సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని బీజేపీ శ్రేణులు, కౌన్సిలర్లు, సర్పంచులతో కలిసి ర్యాలీగా తరలి వెళ్లి చౌటుప్పల్ ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ సందర్భంగా గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గి ఆర్డీవో వెల్మ శేఖర్ రెడ్డి, ఎంపీడీవో కే శ్రీలత ఏకపక్షంగా, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉన్న గ్రామాలకే ప్రాధాన్యత ఇస్తూ, బీజేపీ, బీఆర్‌ఎస్ సర్పంచులు, కౌన్సిలర్లు ఉన్న గ్రామాలపై నిధుల కేటాయింపులో వివక్ష చూపడం దారుణమన్నారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్రం పంపే నిధులను రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లించడం సరికాదని, రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామానికి, వార్డుకు సమానంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

​ఉద్రిక్తత.. పోలీసుల జోక్యం
ముట్టడి సందర్భంగా బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా ఆర్డీవో కార్యాలయంలోని క్యాబిన్ లోపలకు దూసుకెళ్లారు. నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగడంతో తీవ్ర గందరగోళం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి, పలువురు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

​అన్ని గ్రామాలకూ సమన్యాయం చేస్తాం : అధికారులు: పోలీసుల మధ్యవర్తిత్వంతో అధికారులతో జరిగిన చర్చల అనంతరం ఆర్డీవో స్పందిస్తూ… నిధుల కేటాయింపులో ఎలాంటి పక్షపాతం ఉండదని, అన్ని గ్రామ పంచాయతీలకు, వార్డులకు సమన్యాయం జరిగేలా చూస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారుల హామీతో బీజేపీ నాయకులు నిరసనను విరమించారు. ​ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు దోనూరు వీరారెడ్డి దూడేల బిక్షం గౌడ్, రమణగోని శంకర్, గుజ్జుల సురేందర్ రెడ్డి, శాగా చంద్రశేఖర్ రెడ్డి, కైరంకొండ అశోక్, కడారి కల్పన ఐలయ్య యాదవ్, దేవేందర్ యాదవ్, బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుడ్డా సురేష్, కౌన్సిలర్లు ఆలే శ్రీలత చిరంజీవి, పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య, సర్పంచులు తంగెళ్ల వెంకటేశం, కైరంకొండ స్వప్న అశోక్, టేకుల మంజులారెడ్డి, నందగిరి వెంకటేష్, బోయ మహేంద్ర మనీ శరత్ కుమార్, సుర్వి సౌజన్య రాజు, ఉప్పల రమేష్, ఫకీరు శ్రీనివాస్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, యాస అశోక్ రెడ్డి తో పాటు రెండు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.