పొంచి ఉన్న ప్రమాదం

చెట్టును తొలగించండి.. ప్రమాదాన్ని నివారించండి

విద్యుత్‌ వైర్లపై వేలాడుతున్న వేపచెట్టు..
వర్షాకాలంలో ముప్పు పొంచి ఉందంటున్న స్థానికులు
పాఠశాల సమీపంలోనే చెట్టు.. వెంటనే తొలగించాలని డిమాండ్
విద్యుత్‌ లైన్లపై పడే ప్రమాదం..
అధికారుల తక్షణ చర్యలకు స్థానికుల విజ్ఞప్తి

వికారాబాద్‌, ఆంధ్రప్రభ : వికారాబాద్‌ బీటీఎస్‌ కాలనీలోని నారాయణ పాఠశాల సమీపంలో విద్యుత్‌ లైన్లపై వేపచెట్టు కూలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ముందు ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం వెనుకవైపు ఎర్రగుట్టపై ఉన్న వేపచెట్టు విద్యుత్‌ తీగలకు సమీపంలో ఉండటంతో ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.

వర్షాకాలంలో బలమైన గాలులు, వర్షాలకు చెట్లు లేదా భారీ కొమ్మలు విద్యుత్‌ లైన్లపై విరిగిపడే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. అదే జరిగితే విద్యుత్‌ అంతరాయంతో పాటు విద్యుత్‌ షాక్‌ ప్రమాదం కూడా తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల సమీపంలోనే ఈ పరిస్థితి ఉండటంతో విద్యార్థులు, సిబ్బంది భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. ప్రమాదం జరిగే వరకు వేచి చూడకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు ముందుగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి, సంబంధిత శాఖల సిబ్బంది సహకారంతో చెట్టు కొమ్మలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

చెట్టు తొలగించే వరకు విద్యుత్‌ తీగలకు సమీపంలోకి ప్రజలు, విద్యార్థులు వెళ్లకుండా పాఠశాల యాజమాన్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్‌, అటవీ శాఖ సిబ్బంది సమన్వయంతో ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించి ముప్పును నివారించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ప్రమాదం జరిగే ముందు అధికారులు స్పందించి చెట్టును తొలగించాలని, విద్యార్థులు, స్థానికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు.