ఉద్యమకారుల దరఖాస్తులు గ్రామాలకే వచ్చి సేకరించాలి

కేశవరావు కమిటీ గ్రామస్థాయిలో పర్యటించి నిజమైన ఉద్యమకారులను గుర్తించాలి
గుర్తింపు కార్డులు, పింఛన్‌, ఇళ్ల స్థలాలు కల్పించాలని ఉద్యమకారుల డిమాండ్

ఊట్కూర్, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న నిజమైన ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కే. కేశవరావు కమిటీ గ్రామస్థాయిలో పర్యటించి దరఖాస్తులు స్వీకరించాలని ఉద్యమ నాయకులు కోరారు. ఉద్యమకారులందరికీ అందుబాటులో ఉండేలా గుర్తింపు ప్రక్రియను సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు.

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వార్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు, అవార్డు గ్రహీత హెచ్‌. నర్సింహ, ఉద్యమ నాయకులు దోరోళ్ల కృష్ణయ్య, వాకిటి శివకుమార్‌, సూర్యకాంత్‌, చిన్న నర్సింహ, రమేష్‌ మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గ్రామగ్రామాన ప్రజలు, విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యమకారులు సుదీర్ఘంగా పోరాటం చేశారని వారు గుర్తుచేశారు. ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తించి వారి సేవలకు తగిన గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం కే. కేశవరావు అధ్యక్షతన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. కమిటీ ఇప్పటికే ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై సంప్రదింపులు చేపడుతున్న నేపథ్యంలో గ్రామస్థాయిలోనూ దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలని కోరారు.

గ్రామాలకే వచ్చి దరఖాస్తులు తీసుకోవాలి

ఉద్యమకారులందరికీ జిల్లా కేంద్రాలకు వెళ్లడం సాధ్యం కాదని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇబ్బందులు లేకుండా కమిటీ ప్రతినిధులు గ్రామాలకే వచ్చి దరఖాస్తులు స్వీకరించాలని వారు సూచించారు. గ్రామాల్లో పర్యటించడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించే అవకాశం కల్పించాలని కోరారు. కమిటీ నిజమైన ఉద్యమకారులను పారదర్శకంగా గుర్తించి వారికి తగిన గౌరవం, సంక్షేమ ప్రయోజనాలు అందేలా ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గుర్తింపు ప్రక్రియలో భాగంగా పలు వర్గాలతో కమిటీ సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.

ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలి

తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేసి నెలకు రూ.20 వేల పింఛన్‌ అందించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఉద్యమకారులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు.

తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల సేవలు, త్యాగాలను అధికారికంగా గుర్తించి భావితరాలకు వారి చరిత్రను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కే. కేశవరావు కమిటీ నిజమైన ఉద్యమకారులకు అన్యాయం జరగకుండా గుర్తింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో, గ్రామస్థాయిలోనూ విస్తృతంగా దరఖాస్తులు స్వీకరించాలని వారు కోరారు.