లారీ డ్రైవర్‌కు రూ.10,000 జరిమానా

లారీ డ్రైవర్‌కు రూ.10,000 జరిమానా

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : రోడ్డు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ కేవీ మహేష్ నేతృత్వంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం చిలమత్తూరు కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, ఎస్సై మునీర్ అహ్మద్ సిబ్బందితో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

తనిఖీల సమయంలో ఒక లారీ డ్రైవర్‌పై అనుమానం కలగడంతో డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజిత్ పాల్ అనే డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని హిందూపురం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, గౌరవనీయ మెజిస్ట్రేట్ రూ.10,000 జరిమానా విధించారు.

ఈ సందర్భంగా సీఐ జనార్ధన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రమాదకర చర్య అని హెచ్చరించారు. ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.