ఒక్క లింక్.. రూ.4 లక్షలు స్వాహా.. చివరికి!

  • గుజరాత్‌లో నిందితులను గుర్తించి నగదు రికవరీ
  • చాకచక్యంగా వ్యవహరించిన కర్నూలు పోలీసులు

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: సైబర్ మోసానికి గురై రూ.4 లక్షలు కోల్పోయిన ఓ బాధితుడికి కర్నూలు నాల్గవ పట్టణ పోలీసులు ఊరట కల్పించారు. సాంకేతిక ఆధారాలతో గుజరాత్‌లో నిందితులను గుర్తించి వారి నుంచి మోసపూరితంగా అపహరించిన నగదును రికవరీ చేసి బాధితుడికి అందజేశారు.

కర్నూలు పట్టణానికి చెందిన దండు నాగరాజు తెలియని యోనో యాప్ లింక్‌ను క్లిక్ చేయడంతో ఆయన మొబైల్ ఫోన్‌తో పాటు బ్యాంకు ఖాతా హ్యాక్ అయింది. అనంతరం ఆయన ఖాతా నుంచి సుమారు రూ.4 లక్షలు వివిధ క్రెడిట్ కార్డులకు బదిలీ అయ్యాయి. దీంతో బాధితుడు కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి సహకారంతో డెబిట్ అయిన బ్యాంకు ఖాతాలను సాంకేతికంగా విశ్లేషించిన పోలీసులు నిందితుల ఆచూకీని గుర్తించారు.

గుజరాత్‌లో నిందితుల అరెస్టు..

నాల్గవ పట్టణ సీఐ విక్రమ్ సింహా ఆధ్వర్యంలో ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జీసస్‌లతో కూడిన ప్రత్యేక బృందం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు వెళ్లి యాసిన్ యూసుఫ్ భాయ్ పిపాడ్వాలా, ఆవేశ్ యాసిన్ పిపాడ్వాలాలను గుర్తించి అదుపులోకి తీసుకుంది. అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించి చట్టపరమైన చర్యలు చేపట్టింది.

బాధితుడికి రూ.4 లక్షల అందజేత..

నిందితుల నుంచి సైబర్ మోసం ద్వారా అపహరించిన రూ.4 లక్షలను రికవరీ చేసిన పోలీసులు అవసరమైన చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం బాధితుడు దండు నాగరాజుకు నగదును అందజేశారు.

తెలియని లింకులు క్లిక్ చేయొద్దు: ఎస్పీ

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, ప్రజలు తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పిన్ నంబర్లు ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సత్వర చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

పోలీసు బృందాన్ని అభినందించిన ఎస్పీ

సైబర్ మోసం కేసును ఛేదించి నిందితులను గుర్తించి బాధితుడికి నగదు తిరిగి అందించిన సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, నాల్గవ పట్టణ సీఐ విక్రమ్ సింహా, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జీసస్‌తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.