కుటుంబాన్ని కలిపిన అన్నం సేవా ఫౌండేషన్..

అనాథ‌గా తిరిగిన వ్యక్తిని భార్య, పిల్లల చెంతకు చేర్చిన మానవత్వం
ఖమ్మంలో ఆశ్రయం కల్పించి వైద్యసేవలు అందించిన ఫౌండేషన్
మతిస్థిమితం కోల్పోయిన గోపికృష్ణను గుర్తించి కుటుంబానికి అప్పగింత
ఖమ్మం, విజయవాడ భవానిపురం పోలీసుల సమన్వయంతో సుఖాంతం

ఆంధ్రప్రభ, విజయవాడ: సుమారు 45 రోజుల పాటు మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తికి ఆశ్రయం, వైద్యసేవలు అందించి అతని ఆరోగ్యాన్ని మెరుగుపరిచిన ఖమ్మానికి చెందిన అన్నం సేవా ఫౌండేషన్, అనంతరం పోలీసుల సహకారంతో అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. భార్యకు భర్తను, పిల్లలకు తండ్రిని, తల్లికి కుమారుడిని మళ్లీ చేరవేసి అందరి ప్రశంసలు అందుకుంది. ఖమ్మానికి చెందిన అన్నం సేవా ఫౌండేషన్ మరోసారి తన సేవా తత్వాన్ని చాటుకుంది. విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన జగన్నాథం గోపికృష్ణ గత మే నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయి కనిపించకుండా పోయాడు. ఇసుక పనులు చేస్తూ జీవనం సాగించే గోపికృష్ణ మద్యానికి బానిస కావడంతో మానసిక స్థితి కూడా దెబ్బతిన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు మే నెలాఖరులో భవానిపురం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టగా, కుటుంబ సభ్యులు కూడా నిరంతరం అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరంలో రోడ్లపై తిరుగుతున్న గోపికృష్ణను స్థానిక పోలీసులు గుర్తించారు. అతడు తన పేరు, చిరునామా కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండటంతో ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్న అనాధ శరణాలయానికి అప్పగించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గోపికృష్ణకు ఆశ్రయం కల్పించి వైద్య చికిత్స, ఆహారం, సంరక్షణ అందించారు. సుమారు 45 రోజులపాటు నిరంతర సేవలు అందించడంతో అతని ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. అనంతరం తన పేరు గోపికృష్ణ అని, విజయవాడకు చెందినవాడినని చెప్పడంతో ఫౌండేషన్ నిర్వాహకులు ఖమ్మం త్రీ టౌన్ పోలీసుల సహకారంతో విజయవాడ భవానిపురం పోలీసులను సంప్రదించారు. భవానిపురం పోలీస్ స్టేషన్‌లో గోపికృష్ణ మిస్సింగ్ కేసు నమోదై ఉందని నిర్ధారించిన అనంతరం, ఫౌండేషన్ నిర్వాహకులు ఖమ్మం నుంచి గోపికృష్ణను విజయవాడకు తీసుకువచ్చి శనివారం భవానిపురం పోలీసుల సమక్షంలో అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాదాపు రెండు నెలలుగా ఆచూకీ లేక ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు గోపికృష్ణను కళ్లారా చూసి భావోద్వేగానికి గురయ్యారు. తమ కుటుంబాన్ని మళ్లీ ఒక్కటి చేసిన అన్నం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అన్నం శ్రీనివాసరావు, నిర్వాహకులు, సహకరించిన ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు, విజయవాడ భవానిపురం పోలీసులకు గోపికృష్ణ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో అన్నం సేవా ఫౌండేషన్ సేవాభావం మరోసారి వెలుగులోకి వచ్చి, మానవత్వానికి ఆదర్శంగా నిలిచింది.