ఆక్వా రంగానికి ఊరట కల్పించండి.. కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రొయ్యల సాగుదారులపై పెరుగుతున్న ఉత్పత్తి వ్యయ భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన పలు కీలక ప్రతిపాదనలు చేశారు. రొయ్యల మేత తయారీలో వినియోగించే ప్రధాన ముడి పదార్థాల ధరలు ఇటీవల గణనీయంగా పెరగడంతో ఆక్వా సాగు వ్యయం 20 శాతానికి పైగా పెరిగిందని సీఎం వివరించారు. దీంతో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు.

ఆక్వా పరిశ్రమ ద్వారా లక్షలాది మంది రైతులు, కార్మికులు, హేచరీలు, మేత తయారీ సంస్థలు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులు ఉపాధి పొందుతున్న నేపథ్యంలో ఈ రంగానికి ప్రత్యేక రక్షణ అవసరమని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఫిష్ మీల్, చేప నూనె, సోయా లెసిథిన్ వంటి ముడి పదార్థాల ధరలు భారీగా పెరిగినట్లు ఆయన కేంద్రానికి వివరించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముడి సరుకుల ధరలను స్థిరీకరించే విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.

దేశీయ మార్కెట్లో రొయ్యలు, ఇతర ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీఓలు) ఏర్పాటుకు ప్రోత్సాహం, మార్కెటింగ్, బ్రాండింగ్, ప్రాసెసింగ్, రిటైల్ వ్యవస్థల బలోపేతానికి కేంద్రం మద్దతు ఇవ్వాలని సీఎం కోరారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ హెచ్చుతగ్గుల ప్రభావం నుంచి ఆక్వా రంగాన్ని రక్షించేలా ప్రత్యేక సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

అలాగే, రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌తో “ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీ” ఏర్పాటు కోసం జాతీయ మత్స్యాభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) ద్వారా నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు.