3-Cases-One-Day : ఠాణా హైరానా Andhra Prbha Ctime Analysis

3-Cases-One-Day : ఠాణా హైరానా Andhra Prbha Ctime Analysis

  • కేసులన్నీ సత్తెనపల్లివే
  • పోలీసులు పరుగో పరుగు .!
  • క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం .. విద్యార్థిని దుర్మరణం..!
  • పట్టణ పోలీస్ స్టేషన్​ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం…!
  • గంజాయి రవాణా కేసులో ఇద్దరు అరెస్టు…!

( పల్నాడు ప్రతినిధి , ఆంధ్రప్రభ)

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణం నేడు పలు సంఘటనలకు నిలయంగా మారింది… ఏ సంఘటన జరిగిన సత్తెనపల్లి కేంద్రంగా జరగడం తో స్థానికులు ఖంగు తింటున్నారు… మరోవైపు జరుగుతున్న ఘటనా స్థలాలకు పోలీసులు పరుగులు పెడుతున్నారు…. ఈ సంఘటనలు సత్తెనపల్లి పట్టణ పరిసర ప్రాంతాలలో జరగడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది…! ఇక వివరాల్లోకి వెళితే…

3-Cases-One-Day : విద్యార్థిని దుర్మరణం…!

పేరేచర్ల – కొండమోడు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా, సత్తెనపల్లి రూరల్ పరిధిలోని నలంద కాలేజీ సమీపంలో రోడ్డుపై వెళ్తున్న డి లలితని.. రోడ్డు పనుల నిమిత్తం వచ్చిన క్రేన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లలిత ను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సత్తెనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించి కన్నుమూసింది. మృతి చెందిన విద్యార్థిని లలిత నలంద కళాశాలలో ఫైనల్ ఇయర్ బీఫార్మసీ చదువుతున్నట్లు తండ్రి రమేష్ బాబు తెలిపారు. రహదారి పనులు జరుగుతున్న సమయంలో క్రేన్ డ్రైవర్ కనీస జాగ్రత్తలు తీసుకోలేదని, పక్కనే వెళ్తున్న బాలికను గమనించకుండా అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటా…హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రహదారి పనుల వద్ద కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

3-Cases-One-Day : గంజాయి కేసు లో …

అనకాపల్లి జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన గంజాయి అక్రమ రవాణా కేసులో సత్తెనపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వాహనాల తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా, అందులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని అక్కడే వదిలి పరారైనట్లు సమాచారం. తనిఖీలు నిర్వహించిన పోలీసులు కారులో సుమారు 200 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చేపట్టిన దర్యాప్తులో ఈ అక్రమ రవాణాలో సత్తెనపల్లికి చెందిన ఇద్దరు యువకుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి మరికొంత మంది పాత్రపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

3-Cases-One-Day : ఠాణాలో అలజడి

సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లో సోమవారం రాత్రి ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానికంగా హోటల్ నిర్వహిస్తున్న పాలేటి జయబాబుకు పోకల కాంతమ్మ, నాగరాజులతో ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విచారణ కోసం పోలీసులు జయబాబును స్టేషన్‌కు పిలిపించారు. జయబాబు తన స్నేహితుడు పున్నారావుతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ నాగమల్లేశ్వరరావు విచారణ నిర్వహిస్తున్న సమయంలో… జయబాబు తన జేబులో దాచుకున్న పురుగుల మందు డబ్బాను తీసి తాగాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, స్నేహితుడు పున్నారావు కలిసి అతడిని సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన పున్నారావు, కాంతమ్మ, నాగరాజులు తరచూ పోలీసు కేసులతో జయబాబును ఇబ్బందులకు గురిచేస్తుండటంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా పలు కేసులు పెట్టి పోలీసులు వేదిస్తున్నారని జయబాబు బంధువులు ఆరోపించారు.