harishrao | లంబాడీల ఆత్మగౌరవాన్ని కాపాడింది బీఆర్‌ఎస్
harishrao | లంబాడీల ఆత్మగౌరవాన్ని కాపాడింది బీఆర్‌ఎస్
harishrao | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : చిన్న తండాలను కూడా పంచాయతీలుగా మార్చి లంబాడీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి టి.హరీశ్ రావు పేర్కొన్నారు. కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో గిరిజనుల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు.
హైదరాబాద్‌లో లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న హరీశ్‌రావు మాట్లాడుతూ… సేవాలాల్ మహరాజ్ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించామని గుర్తు చేశారు. బంజారాహిల్స్‌లో బంజారాల కోసం ఆత్మగౌరవ భవనం నిర్మించామని తెలిపారు. టీఎస్ ప్రైడ్ కార్యక్రమం ద్వారా 13,200 మందికి ఉద్యోగాలు కల్పించామని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సేవాలాల్, కుమురం భీం, ఏకలవ్య కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని హరీశ్‌రావు విమర్శించారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. లంబాడీల హక్కుల కోసం బీఆర్‌ఎస్ ఎప్పటికీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
