నరసరావుపేటలో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

300 అడుగుల జాతీయ జెండాతో దేశభక్తి నినాదాలు

నరసరావుపేట, ఆంధ్రప్రభ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బుధవారం ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పల్నాడు బస్‌స్టాండ్‌ సమీపంలోని విజయ ఫిల్లింగ్‌ స్టేషన్‌ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం మీదుగా గాంధీ పార్కు వరకు కొనసాగింది.

నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృత్తికా శుక్లా ర్యాలీని ప్రారంభించారు. వాగ్దేవి కళాశాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని 300 అడుగుల జాతీయ జెండాను చేతబూని దేశభక్తి నినాదాలతో ముందుకు సాగారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవిందబాబు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది సమరయోధులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని అన్నారు. యువత వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని కష్టపడి పనిచేయడం, నైతిక విలువలను పాటించడం, ఐక్యతను పెంపొందించడం, సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, ప్రతి యువకుడు తన విద్య, నైపుణ్యాలు, సేవా భావంతో దేశ నిర్మాణంలో భాగస్వామి కావాలని సూచించారు. జాతీయ జెండాను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడేందుకు అందరూ కట్టుబడి ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డీఆర్వో అద్దయ్య, ఆర్డీవో బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన, వాగ్దేవి కళాశాల డైరెక్టర్ రాయల్ శ్రీనివాసరావు, ఏపీ బులియన్ మర్చంట్ అధ్యక్షుడు కపిలవాయి విజయ్‌కుమార్, విద్యార్థులు, కళాశాల సిబ్బంది, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.