జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు భారీ స్పందన
400 మంది క్రీడాకారులతో ఉత్సాహంగా ప్రారంభమైన పోటీలు.. ప్రారంభించిన ఎంపీ భాష్యం రామకృష్ణ
గుంటూరు స్పోర్ట్స్, ఆంధ్రప్రభ: స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకునేందుకు బరిలోకి దిగారు. ముఖ్యంగా అండర్-11, అండర్-13, అండర్-15 విభాగాల్లో అత్యధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం విశేషంగా నిలిచింది.
పోటీలను రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడలపైనా సమాన దృష్టి సారించాలని సూచించారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుతాయని అన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని క్రీడాకారులకు ఆకాంక్షించారు.
అనంతరం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయపాటి రంగారావు, కార్యదర్శి తాడిబోయిన సంపత్‌కుమార్, ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి వజ్జా రామకృష్ణ ఎంపీకి ఘన స్వాగతం పలికి సన్మానించారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో విజేతలను రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మొకమటం వెంకట్, సతీష్ చంద్ర, బండారు రాము, బొచ్చు రమేష్, హరి, స్టేడియం సభ్యులు యామిని, ఉమా మహేశ్వరరావు, వేణు బ్యాడ్మింటన్ అకాడమీ అధినేత వేణు తదితరులు పాల్గొన్నారు.
