అమిత్ షా ముందుకు సిక్కోలు వరద సమస్యలు

అమిత్ షా ముందుకు సిక్కోలు వరద సమస్యలు

నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నిధులను మంజూరు చెయ్యాలని కేంద్రమంత్రి వినతి
సానుకూలంగా స్పందించిన అమిత్ షా.
శ్రీకాకుళం నగరంలో ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్స్.
పీజీ.పేట, కళింగపట్నం వద్ద తీరం కోతను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ.
కేంద్ర నిధులతో గట్టెక్కనున్న సిక్కోలు వరద సమస్యలు
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం నగరానికి వరదల భయాన్ని తొలగించే విధంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక సంస్కరణల దిశగా అడుగులు వేశారు. ఇదివరకే జిల్లా స్థాయి సమీక్షలలో సమస్య పరిష్కారానికి పలు ఆలోచనలు చేసిన రామ్మోహన్ నాయుడు.. మంగళవారం నాడు డిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ప్రత్యేకంగా భేటీ అయ్యి.. శ్రీకాకుళం వరదల సమస్యను ప్రధానంగా చర్చించారు. ఇందుకోసం జాతీయ విపత్తుల నిర్వహణ అధారిటీ నుండి నిధులు మంజూరు చెయ్యాలని కోరారు. దీనిపై అమిత్ షా కూడా సానుకూల స్పందన తెలియజేయడంతో ఈ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించినట్లయింది.

శ్రీకాకుళం నగరంలో నాగావళి నది పరివాహక ప్రాంతాలలో తీరం రక్షణ గోడలను నిర్మించాలని కోరారు. ఇదివరకే వరదల కారణంగా శ్రీకాకుళం నగరం నష్టపోయిన తీరును వివరిస్తూ.. ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ ఆవశ్యకతను వివరించారు. అదేవిధంగా శ్రీకాకుళం మండలం పెద్దగనగల్లవానిపేట వద్ద నాగావళి నది సముద్రంలో కలిసే చోట, కళింగపట్నంలో వంశధార నది కలిసే చోట.. నది ప్రవాహ దిశ నిత్యం మారుతూ.. తీరం కోతకు గురవ్వడంతో పాటు పరివాహక ప్రాంతాలు సైతం ముంపునకు గురవుతున్న నేపథ్యాన్ని అమిత్ షా కు రామ్మోహన్ నాయుడు వివరించారు.

ఈ రెండు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సంస్థలు సిద్ధం చేసిన డి.పి.ఆర్ ల ఆధారంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుండి నిధుల్ని మంజూరు చెయ్యాలని.. అవసరమైన నిధుల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అమిత్ షా దృష్టిలో ఉంచారు. దీనిపై అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించారని రామ్మోహన్ నాయుడు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.