అధైర్య ప‌డొద్దు..

అధైర్య ప‌డొద్దు..

రైతులకు అండగా ప్రభుత్వం

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మార్కెట్ క‌మిటీ చైర్మన్ వెంకటయ్య

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎవరు ఆధైర్యపడవద్దని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంగళవారం మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అధికారుల బృందంతో కలిసి సందర్శించారు. నిన్న రాత్రి ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం కారణంగా మార్కెట్ యార్డులో రైతులు అమ్మకానికి తెచ్చి ఆరబోసిన ధాన్యం కుప్పలు, బస్తాలు తడిసి ముద్దయ్యాయి.

ఈ విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ పాలకవర్గం, అధికారులు వెంటనే మార్కెట్ యార్డుకు చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. తడిసిన ధాన్యాన్ని చూసి ఆవేదన చెందుతున్న రైతులతో చైర్మన్ మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. ​ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం కురిసి రైతాంగాన్ని నష్టాల్లోకి నెట్టడం బాధాకరమన్నారు. వర్షం వల్ల ఎంత మేర ధాన్యం తడిసింది, ఎంత నష్టం వాటిల్లింది అనే అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపుతామని హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేసి తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చెనగోని అంజయ్య, మార్కెట్ సెక్రటరీ రవీందర్ రెడ్డి, ఏపీఎం యాదయ్య, మార్కెట్ కమిటీ సిబ్బంది, పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు పాల్గొన్నారు.

Leave a Reply