మొదటి ప్రయత్నంలోనే అరుదైన అవకాశం

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : రామకృష్ణాపూర్‌కు చెందిన మున్నంగి కీర్తి ప్రభుత్వ నర్సింగ్ అధికారిగా ఎంపికై స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు.
మున్నంగి డేవిడ్‌సన్, రాణి దంపతుల మూడవ కుమార్తె అయిన కీర్తి రామకృష్ణాపూర్‌లోనే పాఠశాల విద్యను పూర్తి చేశారు. అనంతరం కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో బి.ఎస్‌సి నర్సింగ్ అభ్యసించారు.
చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌లోని యశోద, కిమ్స్ ఆసుపత్రుల్లో నర్సింగ్ ఎడ్యుకేటర్‌గా విధులు నిర్వహించారు. 2025లో నిర్వహించిన ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్ నియామక పరీక్షలో కీర్తి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు.
కీర్తి తండ్రి మున్నంగి డేవిడ్‌సన్ సింగరేణి సంస్థ మందమర్రి వర్క్‌షాప్‌లో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. ఆయన కీబోర్డ్ వాద్యకారుడు, గాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. సింగరేణి కోల్‌ఫీల్డ్ స్థాయిలో నిర్వహించిన పలు సంగీత పోటీల్లో బంగారు పతకాలతో పాటు అనేక బహుమతులు సాధించారు.
తల్లి రాణి కూడా గాయనిగా సేవలందిస్తున్నారు. ఈ దంపతులు పలు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.
సంగీత రంగంలో గుర్తింపు ఉన్న కుటుంబం నుంచి కుమార్తె ప్రభుత్వ వైద్యరంగంలో ఉద్యోగం సాధించడంపై స్థానికులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కీర్తి విజయంపై పలువురు ప్రముఖులు, సింగరేణి ఉద్యోగ సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.
