కర్నూలులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..
వ్యభిచార కేంద్రంపై ఎస్‌ఈబీ, స్థానిక పోలీసుల సంయుక్త దాడులు
నిర్వాహకుడిపై కేసు నమోదు.. ఇతరుల పాత్రపైనా దర్యాప్తు
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు నగరంలోని గోవర్ధనగిరి నగర్‌లో రహస్యంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై ఎస్‌ఈబీ, స్థానిక పోలీసుల సంయుక్త బృందం శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మికంగా దాడులు నిర్వహించింది. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడ ఉన్న నలుగురు మహిళలను రక్షించారు. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ అక్రమ కార్యకలాపాలకు సహకరించిన ఇతరుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ప్రజలకు సూచించారు.
