శ్రీవారి భక్తులకు శుభవార్త..
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఇంతకీ విషయం ఏంటంటే.. శ్రీవారి దర్శనానికి గంటలు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చాలి.. భక్తులను అంతసేపు వెయిట్ చేయించకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తుందట. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ సాయంతో స్వామివారి దర్శనాన్ని కేవలం రెండు గంటల్లోనే పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టీటీడీ బోర్డు ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు తెలియచేశారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే సక్సెస్ అయ్యిందని.. త్వరలోనే ఈ విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకవస్తామని ఆయన చెప్పారు.
టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తెలియచేశారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రంలోని దళిత వాడల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రాథమికంగా 5 వేలకు పైగా వాడల్లో ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు.
తిరుమల కొండ కింద సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో 25 వేల మంది భక్తులకు వసతి, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించే ఆలోచనలో ఉన్నామని బీఆర్ నాయుడు తెలిపారు. అలాగే ఒంటిమిట్ట ఆలయం వద్ద 100 గదులతో వసతి గృహం నిర్మించడంతో పాటు, 108 అడుగుల భారీ జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలియచేశారు.

