నిరుపయోగంగా వాటర్ ఫ్రిడ్జ్

నిరుపయోగంగా వాటర్ ఫ్రిడ్జ్
తాగునీటి కోసం అవస్థలు పడుతున్న ప్రయాణికులు
ప్రయాణికుల సంక్షేమాన్ని పట్టించుకోని ఆర్టీసీ యాజమాన్యం
మంథని, ఆంద్రప్రభ : ఎండలు మండిపోతున్న వేళ మంథని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు కనీస తాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన వాటర్ ఫ్రిడ్జ్ నెలలుగా నిరుపయోగంగా ఉండటంతో ప్రయాణికులు మంచినీటి కోసం అల్లాడుతున్నారు. ప్రయాణికులే సంస్థకు ఆదాయ వనరులని చెప్పే ఆర్టీసీ యాజమాన్యం, వారి సంక్షేమాన్ని మాత్రం పూర్తిగా విస్మరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మండుతున్న ఎండల్లో బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండే ప్రయాణికులకు కనీసం చల్లని నీరు కూడా అందుబాటులో లేకపోవడం ఆగ్రహానికి గురిచేస్తోంది. బస్టాండ్‌లో ఉన్న వాటర్ ఫ్రిడ్జ్ చెడిపోయి చాలా రోజులైనా మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు బయట దుకాణాల వద్ద నీళ్లు కొనుగోలు చేసి దాహం తీర్చుకుంటున్నారు.
ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉన్నప్పటికీ నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటర్ ఫ్రిడ్జ్‌ను మరమ్మతు చేసి తాగునీటి సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
