Ghantasala | మరో శంకరాభరణం కానుందా..?
Ghantasala | మరో శంకరాభరణం కానుందా..?
Ghantasala, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల వేంకటేశ్వరరావు (ఘంటసాల) బయోపిక్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కింది. సి.హెచ్. రామారావు దర్శకత్వంలో ఘంటసాల ది గ్రేట్ అనే టైటిల్‌తో డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో ఘంటసాల జీవితాన్ని ఆధారంగా చేసుకుని, ఆయన లైఫ్ లోని విభిన్న ఘట్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ (Suman) ముఖ్య పాత్రను పోషించారు. హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఘంటసాల బయోపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదిక పై ఘంటసాల గొప్పతనాన్ని, తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసింది ఘంటసాల బయోపిక్ చిత్ర యూనిట్.
ఈ చిత్రంలో ఘంటసాల పాత్ర పోషించిన కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. నేను సింగర్‌ని, యాక్టర్‌ని కాదు. ఘంటసాల పాటలు వింటూ పెరిగిన నాకు ఈ సినిమాలో నటించే అదృష్టం దక్కడం ఒక వరం. పాటలు పాడుకునే నన్ను రామారావు గారు పట్టుబట్టి ఈ రోల్ చేయించారు. ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. తెలుగు సినిమా సంగీతానికి రెండు కళ్ళలో ఒకటి ఘంటసాల గారు అయితే.. రెండోది బాలసుబ్రమణ్యం గారు. (SP Balu)ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కూడా మూడేళ్ళ క్రితం ఆయన చేతుల మీదుగానే జరిగింది. అది కూడా నా అదృష్టం. వాళ్ళందరి ఆశీర్వాదం ఈ సినిమాపై, నాపై ఉండటం నా అదృష్టం. డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా చూసి మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
ఘంటసాల బయోపిక్ దర్శకుడు సి.హెచ్. రామారావు మాట్లాడుతూ.. మహాగాయకుడు ఘంటసాల గారి గురించి ఇప్పటి తరానికి తెలియాలనే తపనతో ఎంతో కష్టపడి ఈ సినిమా తీసాం. గొప్ప సినిమా తీశాను అని సంతృప్తిగా ఉంది. ఈ సినిమా ప్రివ్యూ చూసి సినీ ప్రముఖులు అభినందిస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. భారతదేశ చరిత్రలోనే ఒక గాయకుడి బయోపిక్ రావడం ఇదే ప్రధమం. ఆ ఖ్యాతి ఘంటసాల గారికి దక్కింది. అది తీసే అదృష్టం నాకు దక్కింది. ఈ సినిమా చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా ప్రయాణంలో నా వెంట నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా మరో శంకరాభరణం అంటూ ఈ వేడుకకు వచ్చిన సినీ ప్రముఖులు చెబుతుంటే ఆనందంగా ఉంది అని అన్నారు.
