అనాథ బాలికలకు ఉచిత పాలిటెక్నిక్ అవకాశం

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను మూడు సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం అనాథ బాలికలు దరఖాస్తు చేసుకోవాలని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొనికెన కుమారస్వామి తెలిపారు.

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఉన్న లేదా వివిధ కారణాల వల్ల అనాథలైన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ (DCE), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (DEEE), కంప్యూటర్ ఇంజనీరింగ్ (DCME), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (DECE), DSC, DLD వంటి ఆరు కోర్సుల్లో ప్రతి కోర్సుకు 60 సీట్లు చొప్పున మొత్తం 360 సీట్లు ఉన్నాయని, అందులో 70 శాతం సీట్లు అనాథ బాలికలకు కేటాయించినట్లు తెలిపారు.

పాలీసెట్ పరీక్ష రాయకపోయినా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, కనీసం పదో తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుందని చెప్పారు. దరఖాస్తు చేసుకునే వారు తల్లిదండ్రుల మరణ ధృవపత్రం, సంబంధిత హోమ్ లేదా హాస్టల్ సూపరింటెండెంట్ ధృవీకరణ, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC), SSC మెమో, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తదితర పత్రాలను జతపరచి పూర్తి చేసిన దరఖాస్తులను ఆయా జిల్లాల బాల రక్షా భవన్ లేదా బాలల సంరక్షణ విభాగంలో సమర్పించాలన్నారు.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 23 మే 2026 సాయంత్రం 5 గంటల వరకు అని తెలిపారు. ఎంపికైన బాలికలకు మూడు సంవత్సరాల పాటు పూర్తిగా ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఆయా జిల్లాల స్త్రీ, శిశు సంక్షేమ మరియు మహిళా అభివృద్ధి శాఖాధికారులను సంప్రదించవచ్చని, లేదా 9441634761 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.