మాజీ సీఎం కుండకు.. కూటమి ఎసరు
మూడు కంపెనీలకు సున్నం
లీజుల రద్దుకు ప్లాన్
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి) : ప్రత్యర్థి ఆర్థిక మూలాలను ధ్వంసం చేయటం.. రాజకీయ వ్యూహంలో..ప్రధాన ఎత్తుగడ. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే.. తన ప్రత్యర్థి రాజకీయ పార్టీ బలాన్ని నిర్వీర్యం చేయటం సర్వసాధారణం. ఏపీ రాజకీయాల్లో ఈ వ్యూహం గత పదేళ్లుగా .. కొనసాగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని.. అప్పటి అధికార పార్టీ వైసీపీ.. ఏకంగా మూడు రాజధానులను తెరమీదకు తీసుకువచ్చింది. 30 వేల ఎకరాలను ప్రభుత్వం సమీకరిస్తే.. ఈ భూమిని రియల్లర్లు హస్తగతం చేసుకున్నారని, పరోక్షంగా బినామీలే భూమికి యజమానులను వైసీపీ ప్రభుత్వం .. ఐదేళ్లు రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంది. ఇది వాస్తవం. తెలుగుదేశం పార్టీకి చెందిన అప్పటి మంత్రులు, నాయకులు అమరావతిలో పాగా వేశారని, వీరిని ఆర్థికంగా దెబ్బతీయటానికే.. తెరమీదకు మూడు రాజధానులు వచ్చాయని .. ఏపీ జనం భావించారు.

ఇక ప్రస్తుతం అధికారంలోకి వవ్చిన కూటమి ప్రభుత్వం .. మళ్లీ అమరావతికి ప్రాణం పోసింది. ఇక పనిలో పనిగా.. ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఆర్థిక మూలలపై దృష్టి సారించింది. వైసీపీ ప్రభుత్వం ఎక్కడెక్కడ భూముల్ని హస్తగతం చేసుకుందో.. ఆ భూముల్ని వాపసు తీసుకునే వ్యూహాన్ని రచిస్తోంది. అమలు చేస్తోంది. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్థాంగి భారతీ అన్యాక్రాంత ఆర్థిక మూలలపై దృష్టి సారిస్తోంది. మరీ ముఖ్యంగా భారతీ సిమెంట్స్ ని దెబ్బతీసేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మాజీ సీఎం జగన్ సతీమణి భారతి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంస్థ ఏపీలో గనుల లైసెన్సులను అక్రమంగా పొందారనే ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి సారించింది. గనుల శాఖ నిబంధనలను ఉల్లంఘించి లైసెన్సులు పొందారనే ఆరోపణలు తెరమీదకు వచ్చాయి .
వేలం పాటలో కొత్త లీజులు పొందాలని కేంద్ర గనులశాఖ నిబంధనలు ఉన్నా, పాత దరఖాస్తుల సాకుతో భారతీ సిమెంట్స్ రెండు సున్నపు రాయి గనుల లీజులు పొందినట్టు ఆరోపణల నేపథ్యంలో భారతీ సిమెంట్‌కు షాక్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది, 2024 ఎన్నికలకు ముందు ఈ లైసెన్సులు పొందారని తెలుస్తోంది. భారతీ సిమెంట్స్ తో పాటు అసోసియేట్ సిమెంట్ కంపెనీ (ఏసీసీ), రామ్‌కో సిమెంట్స్ కి ఇచ్చిన లీజులను కూడా రద్దు చేస్తారని సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏయే సంస్థలకు ఎన్నెన్ని లైసెన్సులు ఇచ్చారో, ఎందుకిచ్చారో, ఎలా ఇచ్చారో నివేదికను తయారు చేయాలని గనుల శాఖను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలో వైసీపీ ప్రభుత్వం భారతీ సిమెంట్స్ కి రెండు, ఏసీసీకి ఒకటి, రామ్ కో సిమెంట్స్ కి ఒక సున్నపు రాయి గనిని కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర గనులశాఖ 2015లో జారీ చేసిన సవరణ నిబంధనలకు ఇది విరుద్ధమని ఆరోపణలు వచ్చాయి. కేంద్ర గనుల శాఖ నిబంధనల ప్రకారం.. ప్రధాన ఖనిజాల (మేజర్ మినరల్స్) లీజులను వేలం ద్వారానే పొందాలి. 2015 జనవరి 12 కు ముందు లీజు కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌వోఐ)ను ఎవరికైనా జారీచేస్తే, 2017 జనవరి 11 నాటికి (రెండేళ్లలో) అన్ని అనుమతులూ పొంది లీజు కొనసాగించాలని, లేకపోతే ఎల్‌వోఐలు రద్దవుతాయని స్పష్టంగా ఉంది. కడప జిల్లా కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లోని రఘురామ్ సిమెంట్స్‌కు సున్నపురాయి నిక్షేపాల భూములను 2009లో భారతీ సిమెంట్ కొనుగోలు చేసింది.
అందులో 509.18 ఎకరాలు, 235.56 ఎకరాల్లో రెండు సున్నపురాయి లీజులు కేటాయించాలని అప్పట్లోనే దరఖాస్తు చేయగా, వాటికి ఎల్‌వోఐలు జారీచేశారు. తర్వాత లీజులకు అవసరమైన అనుమతులను భారతీ సిమెంట్ పొందలేకపోయింది. రఘురాం సిమెంట్స్, భారతి సిమెంట్‌గా మారిన విషయాన్ని గనుల శాఖకు సమాచారం లేనందున ఎల్‌వోఐని ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం 2016 లో నోటీసు ఇచ్చింది. దీనిపై భారతీ సిమెంట్ హైకోర్టుకు వెళ్లగా స్టేటస్‌కో వచ్చింది .లీజుల కేటాయింపు వివాదంలో భారతీ సిమెంట్ వాదన విని, నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు 2023లో ఆదేశించగా.. 2024 ఫిబ్రవరి 2న రెండు సిమెంట్ లీజులు మంజూరుచేస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సరిగ్గా నెల రోజుల ముందు ఈ లీజు అనుమతుల వ్మవహారం జరిగింది.
కడప జిల్లా మైలవరం మండలంలోని 2,463.83 ఎకరాల్లో సున్నపురాయి లీజు కోసం ఏసీసీకి 2010లో అప్పటి ప్రభుత్వం ఎల్‌వోఐ జారీచేసింది. 2015లో కేంద్ర నిబంధనలు అమల్లోకి వచ్చాక రెండేళ్లలో ఆ సంస్థ లీజు పొందలేకపోయింది. తర్వాత అది హైకోర్టును ఆశ్రయించింది.2022లో ఏసీసీని అదానీ సిమెంట్స్ దక్కించుకుంది. లీజుదారు వాదన విని, నిర్ణయం తీసుకోవాలని 2023లో హైకోర్టు ఆదేశాలివ్వగా, అప్పటి వైసీపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం, తర్వాత ఏజీ అభిప్రాయాన్ని తీసుకుంది. వీరిద్దరూ లీజుదారులకు సానుకూల అభిప్రాయం వ్యక్తం చేయటంతో ఏసీసీకి 2,463.83 ఎకరాల్లో లీజు మంజూరుచేస్తూ 2023 నవంబరు 15న ఉత్తర్వు జారీచేశారు. అనంతరం ఇదే కోవలో భారతీ సిమెంట్ కూడా రెండు లీజులు పొందింది.
ఏసీసీ, భారతీ సిమెంట్‌తో పాటు రామ్‌కో సిమెంట్స్ కూడా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలోని 267.30 ఎకరాల్లో లీజును 2024 మార్చి 15న పొందింది. మూడు కంపెనీలు మైనింగ్ ప్లాన్ కోసం కేంద్ర సంస్థ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం)కు దరఖాస్తు చేసుకోగా, ఈ లీజుల లొసుగులను ఐబీఎం గుర్తించింది. వేలం ద్వారా కాకుండా దరఖాస్తుల ద్వారా లీజులు పొందడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొని, ఆ సమాచారాన్ని కేంద్ర గనులశాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ లీజుల రద్దుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర గనుల శాఖ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎందుకంటే.. భారతదేశంలో గనులను లైసెన్స్‌కు ఇచ్చే అధికారం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పంచుకుంటాయి. – బొగ్గు, లిగ్నైట్, ఇనుము, బాక్సైట్, బంగారం, డైమండ్ వంటి ప్రధాన ఖనిజాల గనుల లైసెన్స్‌లను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1957 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఈ ఖనిజాలపై నియంత్రణ కలిగి ఉంటుంది. లైసెన్స్ జారీ నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని భారత గనుల మంత్రిత్వ శాఖ (Ministry of Mines) అమలు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సులు చేయవచ్చు.
- ఇసుక, సున్నపు రాయి, గ్రానైట్, మట్టి భారతదేశంలో గనుల లీజు (మైనింగ్ లీజు) వివాదాలలో ఆర్టికల్ 226 ప్రకారం (Article 226) హైకోర్టు జోక్యం చేసుకుంటుంది. ఇది ప్రత్యక్షంగా వివాదాన్ని పరిష్కరించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం లేదా సంబంధిత అధికారుల చర్యలను పరిశీలించి, అవసరమైతే ఆదేశాలు జారీ చేస్తుంది. – గనుల లీజు దరఖాస్తు తిరస్కరణ, పునరుద్ధరణ (రెన్యూవల్) కోరికలు, రద్దు, లేదా MMDR యాక్ట్ (Mines and Minerals Development and Regulation Act, 1957) ప్రకారం ఉల్లంఘనలపై అసంతృప్తి ని హైకోర్టులో రిట్ పిటిషన్ లో వ్యక్తం చేయవచ్చు. – హైకోర్టు విషయాన్ని విచారించి, రాష్ట్ర ప్రభుత్వానికి సమయం పరిమితంతో నిర్ణయం తీసుకోవాలని లేదా లీజు గ్రాంట్/రెన్యూవల్ చేయాలని ఆదేశించవచ్చు. – హైకోర్టు సాధారణంగా ప్రత్యక్షంగా లీజు గ్రాంట్ చేయదు లేదా వివాదాన్ని స్వయంగా పరిష్కరించదు.
బదులుగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది, కానీ అవసరమైతే నోటిఫికేషన్లు / ఆర్డర్లను రద్దు చేసి ప్రత్యక్ష జోక్యం చేసుకోవచ్చు. ఉదాహరణ: పాట్నా హైకోర్టు బ్రిక్-కిల్ క్వార్రీలకు రాష్ట్రం ఇచ్చిన మినరల్ ఎక్సెంప్షన్‌ను అధికారవిహీనమని ప్రకటించి రద్దు చేసింది, MMDR యాక్ట్ ప్రకారం లీజు అవసరమని నిర్ధారించింది. ఇలాంటి స్థితిలో భారతీ సిమెంట్స్,.. ఏసీసీ , రామ్ కో సిమ్మెంట్స్ ఆధీనంలోని సున్నపురాయి లీజును ఏరీతిలో కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుంది? ఇదీ హాట్.. పొలిటికల్ వార్ గా మారబోతోంది. ఇదీ రాజకీయ పండితుల విశ్లషణ.

