For90days | పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్ష‌లు

For90days | పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్ష‌లు

For90days | కేంద్రం సంచలన నిర్ణయం
200 లీట‌ర్ల మించి కొనుగోలుకు నో
అన్ని పెట్రోల్ బంకుల‌కు కేంద్రం ఆదేశం
దేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచే అమ‌లు

For90days | న్యూ ఢిల్లీ, ఆంధ్ర‌ప్రభ : దేశంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆంక్షలు విధించింది. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు సాధారణ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా కేంద్రం నిరోధించింది. వీరంతా తమకు కావలసిన ఇంధనాన్ని కేవలం బల్క్ సేల్ పాయింట్ల నుండే సేకరించాలని అధికారిక ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రాథమికంగా 90 రోజుల పాటు అమలులో ఉండే ఈ ఆంక్షలు తక్షణమే వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

బల్క్ ధరలకు, రిటైల్ ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసం కారణంగా పెద్ద పెద్ద పరిశ్రమలు సాధారణ బంకుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తుండటంతో, కొన్ని ప్రాంతాల్లో డీజిల్‌కు అసాధారణ డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర సాధారణ బంకుల్లో రూ. 95.20 ఉండగా, బల్క్ కొనుగోలుదారులకు అది రూ. 134.50 గా ఉంది.

ధరల వ్యత్యాసానికి కారణం ఇదే!

ఫిబ్రవరి చివరి వారంలో పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. అయితే, సాధారణ వినియోగదారులపై ఆ భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రిటైల్ ధరలను నియంత్రించాయి. కానీ, టెలికాం టవర్లు, విద్యుత్ ఉత్పత్తి, ఇతర పారిశ్రామిక అవసరాల కోసం డీజిల్‌ను పెద్ద మొత్తంలో వాడే ‘బల్క్ వినియోగదారుల’కు మాత్రం అంతర్జాతీయ మార్కెట్ ధరలనే వసూలు చేస్తున్నారు.

దీనివల్ల రిటైల్ బంకుల ధరలు, వాస్తవ ఉత్పత్తి వ్యయం కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని పరిశ్రమలు బంకుల వైపు మళ్లాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ జూన్ 11న ‘మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ (టెంపరరీ రెగ్యులేషన్ ఆఫ్ సప్లై త్రూ రిటైల్ అవుట్‌లెట్స్) ఆర్డర్, 2026’ ను జారీ చేసింది.

కొనుగోళ్లపై పరిమితులు.. రీసేల్ చేస్తే శిక్షార్హం!
ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, షిప్పింగ్ లాజిస్టిక్స్ సమస్యల వల్ల చమురు సరఫరా వ్యవస్థపై ప్రభావం పడిందని కేంద్రం తెలిపింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు సాధారణ బంకులకు రాకుండా నిరోధించడమే కాకుండా, రిటైల్ బంకుల్లో డీజిల్ అమ్మకాలను కేవలం వాహనాల ఇంధన ట్యాంకులకు లేదా ఆమోదించిన కంటైనర్లకు మాత్రమే పరిమితం చేశారు. ఏ ఒక్క కస్టమర్ లేదా వాహనానికి రోజుకు 200 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ విక్రయించకూడదని పరిమితి విధించారు. ఇలా కొనుగోలు చేసిన డీజిల్‌ను వేరే ఎవరికీ తిరిగి విక్రయించకూడదని స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఆందోళన..
సాధారణ ప్రజల కోసం కేటాయించిన ఇంధనాన్ని బల్క్ వినియోగదారులు కొనుగోలు చేయడం వల్ల స్థానికంగా కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, తద్వారా సామాన్యుడికి అవసరమైన నిత్యావసర సేవలకు అంతరాయం కలుగుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆంక్షలను అమలు చేసే పూర్తి బాధ్యతను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు అప్పగించారు.

అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇంధన నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అనధికారిక కొనుగోళ్లు, ఇంధన మళ్లింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ‘నిత్యావసర వస్తువుల చట్టం కింద కఠినంగా శిక్షిస్తామని కేంద్రం హెచ్చరించింది. అయితే, అత్యవసర పరిస్థితుల్లో ఏవైనా ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నిర్ణయిస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

click here to read నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీఓ లంచం తీసుకుంటూ…

click here to read more