MP Etela | ప్రభుత్వానికి ముందు చూపు లేదు..

MP Etela | ప్రభుత్వానికి ముందు చూపు లేదు..
- నగరంలో దుస్థితిపై సీఎం రేవంత్ కు లేఖ రాస్తా
- అవసరమైతే స్వయంగా కలిసి ప్రస్తావిస్తా
కంటోన్మెంట్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయినా.. ప్రజా సంక్షేమం దిశగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు.
నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి కనెక్షన్లను విస్తరించకపోవడంతో.. ప్రజలు ప్రతిరోజూ తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యతో గంటల తరబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వ ముందుచూపు లోపానికే నిదర్శనమని అన్నారు
సోమవారం కంటోన్మెంట్ సిక్ విలేజ్ గాయత్రి గార్డెన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈటెల మాట్లాడారు. నగరంలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని సూచించారు.
నగరవ్యాప్తంగా ఏ రోడ్డు చూసిన గంటలపాటు ట్రాఫిక్ మయంగా రోడ్లు కిక్కేసిపోతున్నాయని అన్నారు. తాజా వర్షాలతో రోడ్లు అస్తవ్యస్తంగా మారి, ఎక్కడ చూసినా గుంతలు, దెబ్బతిన్న రహదారులు ప్రజలకు మరింత ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని సరిచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర విడిచి పనిచేయాలని సూచించారు.
రాజకీయ లబ్ధి కోసమే అధికారులను గుప్పిట్లో పెట్టుకుని, పోలీసులతో అమాయక డ్రైవర్లపై అనవసరమైన చాలానాలు వేయడం సరికాదని విమర్శించారు. త్రాగునీటి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో పాటు, సరైన సమయంలో నీరు సరఫరా చేయకపోవడం కూడా ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు.
డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న కారణంగా మురుగునీరు రోడ్లపైకి రావడం, చెరువుల్లో పడటం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని పేర్కొన్నారు. రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ సరిదిద్దడం, త్రాగునీటి సరఫరా మెరుగుపరచడం వెంటనే చేపట్టాలని, అలాగే నిర్మాణం పూర్తిగా ముగిసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అసలైన లబ్ధిదారులకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఈటెల విజ్ఞప్తి చేశారు.
