Elkathurthy | కాల్వలు కబ్జా.. మురుగునీటిలో మగ్గుతున్న కాలనీలు

Elkathurthy | కాల్వలు కబ్జా.. మురుగునీటిలో మగ్గుతున్న కాలనీలు

  • వేస్ట్ వాటర్ వెళ్లేదెలా?..
  • 10, 11వ వార్డుల ప్రజల ఆవేదన
  • ఆక్రమణలతో మూసుకుపోయిన కాల్వలు..
  • దోమలు, దుర్వాసనతో నరకయాతన
  • మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతున్న స్థానికులు

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పలు వార్డుల్లో నాలాలు, మురుగుకాల్వలు ఆక్రమణలకు గురికావడంతో ప్రజలు ఏళ్ల తరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 10, 11వ వార్డుల్లో మురుగునీరు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో కాలనీలు మురుగునీటితో నిండిపోతున్నాయి. వర్షాకాలం సమీపిస్తున్న వేళ పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఈ వార్డుల నుంచి వచ్చే మురుగు, వర్షపు నీరు జాతీయ రహదారి దాటి 12వ వార్డు పరిధిలోని కాల్వలు, పొలాల గుండా నాగుల చెరువులోకి వెళ్లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే కాలక్రమేణా కాల్వలు ఆక్రమణలకు గురికావడంతో పాటు కొందరు వాటిపైనే నిర్మాణాలు చేపట్టడంతో నీటి ప్రవాహానికి పూర్తిగా ఆటంకం ఏర్పడింది. దీంతో మురుగునీరు రోజుల తరబడి నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది.

నిల్వ నీటిలో పందులు సంచరిస్తుండటంతో పాటు దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. మురుగునీటి సమస్యను ఐదు నెలలుగా పాలకవర్గం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపలేదని 11వ వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు. పంచాయతీ సమావేశాల్లో పలుమార్లు చర్చించినా, తీర్మానాలు చేసినా పనులు మాత్రం ప్రారంభం కాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ఒత్తిడితో ఇటీవల సర్పంచ్, ఉప సర్పంచ్, ఏఈ, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విషయంపై 11వ వార్డు సభ్యుడు జన్నారపు వెంకటేష్ మాట్లాడుతూ, గతంలో ఉన్న సహజ నీటి మార్గాలు, కట్టుకాల్వలు, మురుగునీటి ప్రవాహ మార్గాలను గుర్తించి పునరుద్ధరిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. పాత రికార్డులు, నక్షాల ఆధారంగా సర్వే నిర్వహించి ఆక్రమణలను గుర్తించాలని, వర్షాకాలానికి ముందే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Leave a Reply