విజయవాడలో విషాదం…
పాఠశాల భవనం పై నుంచి దూకిన 9వ తరగతి విద్యార్థిని
పరీక్ష అనంతరం ఆత్మహత్యాయత్నం..
పరిస్థితి విషమం..కేసు నమోదు
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
(సత్యనారాయణపురం, ఆంధ్రప్రభ) : విజయవాడ సత్యనారాయణపురంలోని రవీంద్రభారతి పాఠశాలలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న శాన్వి అనే విద్యార్థిని పరీక్ష రాసిన అనంతరం పాఠశాల భవనం పై అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. విద్యార్థిని తీవ్రంగా గాయపడటంతో పాఠశాల యాజమాన్యం వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటనపై విద్యార్థిని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత కూడా దాదాపు 40 నిమిషాల పాటు విద్యార్థినిని సకాలంలో గుర్తించి స్పందించలేదని, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి దారితీసిన కారణాలు ఏమిటి, ఘటన సమయంలో పాఠశాల యాజమాన్యం భద్రతా చర్యలు ఎలా ఉన్నాయి, నిర్లక్ష్యం జరిగిందా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
