Brain Health | ఆరోగ్యకర జీవనశైలితో మెదడుకు రక్షణ

Brain Health | ఆరోగ్యకర జీవనశైలితో మెదడుకు రక్షణ
Brain Health | హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఆరోగ్య విషయంలో మనం చేసే చిన్న తప్పులే మెదడుకు పెద్ద ముప్పుగా మారవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటేనే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మెదడు ఒకటి. ఇది మన ఆలోచనలు, మాటలు, భావోద్వేగాలను నియంత్రిస్తుంది. మనం చేసే ప్రతి చర్య, తీసుకునే ప్రతి నిర్ణయం మెదడు ఆదేశాల ప్రకారమే జరుగుతుంది. అంత ముఖ్యమైన మెదడును కొన్ని చెడు అలవాట్లతో మనమే దెబ్బతీసుకుంటున్నామని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్లను మార్చుకుంటే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
అల్పాహారం మానేయడం ప్రమాదకరం
ప్రతి రోజు ఉదయం అల్పాహారం తీసుకోకపోతే మెదడుకు అవసరమైన గ్లూకోజ్ తగ్గిపోతుంది. రాత్రంతా ఖాళీ కడుపుతో ఉన్న తర్వాత మెదడుకు తక్షణ శక్తి అవసరం ఉంటుంది. అది అందకపోతే జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, అలసట, చిరాకు వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో తెలివితేటలు, గ్రహణశక్తి తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే తగినంత నిద్ర లేకపోవడం కూడా మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. నిద్రలోనే మెదడు సమాచారాన్ని నిల్వ చేసుకుంటుంది. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మెదడు మొద్దుబారి, సరైన నిర్ణయాలు తీసుకోలేరని చెబుతున్నారు.
చక్కెర అధికం ప్రమాద సూచనే…
చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. దీని వల్ల వాపు, ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలు ఏర్పడతాయి. మెదడులో న్యూరోట్రాన్స్‌మిటర్ల ఉత్పత్తి తగ్గి, న్యూరాన్ల మధ్య సమాచార మార్పిడి దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం కూడా మెదడుకు హానికరం. సిగరెట్లలోని నికోటిన్ మెదడుకు రక్తప్రవాహాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల మెదడు కుంచించుకుపోయే ప్రమాదం ఉంది. డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
స్క్రీన్ టైమ్, నీటి కొరత ప్రభావం
ప్రస్తుతం చిన్నవారినుంచి పెద్దల వరకు ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరిగింది. గంటల తరబడి స్క్రీన్ ముందు గడపడం మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి స్క్రీన్ టైమ్‌ను తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగకపోవడం వల్ల కూడా మెదడు పనితీరు మందగిస్తుంది. రోజంతా సరిపడా నీరు తీసుకోవడం వల్ల మెదడు, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి, చిన్న చిన్న అలవాట్లే మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ఎంతో అవసరం.
