ముందస్తు అడ్మిషన్లను అరికట్టండి…

ముందస్తు అడ్మిషన్లను అరికట్టండి…
కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి..
ప్రచార ఫ్లెక్సీలను తొలగించాలి.
పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షలు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ డిమాండ్ చేశారు. శనివారం సాయిబాబా నగర్ లో ఉన్న పి డి ఎస్ యు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలైన మరియు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు 2026 -27 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించారని అన్నారు.
కార్పొరేట్ సంస్థల వారు బహిరంగంగా కరపత్రాలు, ఫ్లెక్సీలు వేసి అడ్మిషన్ల కొరకు ఎలక్షన్ ప్రచారం రీతిలో కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలలు ప్రచారం నిర్వహిస్తూ ఐఐటి త్రిబుల్ ఐటీ ఫౌండేషన్ లాంటి కోర్సులు ఎల్కేజీ నుండే ప్రారంభిస్తున్నామని తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. ఆర్థికమే ధ్యేయంగా పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా సరైనటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించి, చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.
కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థ యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్ల పేర్లతో పిఆర్ఓ లను, ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాకముందే ముందస్తు అక్రమ అడ్మిషన్ ఫీజులతో పాటు, స్పెషల్ ఫీజు, పుస్తకాల ఫీజులని విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.
తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో పాఠశాలలో ఉదృతమైన ఆందోళన నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో షైక్.షాహీద్, మధుకిరణ్, బాలాజీ, వినోద్, కిరణ్, నాయక్, రవి తదితరులు పాల్గొన్నారు.
