ఇంటర్ ఫలితాల భయంతో…
ఇంటర్ ఫలితాల భయంతో…
మూడు రోజుల ముందే విద్యార్థి ఆత్మహత్య..
తీరా ఫలితాలలో 347 మార్కులతో పాస్..
కన్నీరు మున్నీరవుతున్న ఆ గ్రామం..
బోనకల్, ఆంధ్రప్రభ : ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అవుతాననే భయంతో ఆ విద్యార్థి ఫలితాలు రావడానికి మూడు రోజుల ముందే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. తీరా ఫలితాలు వచ్చేసరికి.. ఆ విద్యార్థి 347 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఖమ్మం జిల్లా,బోనకల్ మండలం, రాపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. రాపల్లి గ్రామానికి చెందిన గంగదేవుళ్ల అక్షాంత్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి పరీక్షల ఫలితాలపై భయంతో మూడు రోజుల క్రితం గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే పరీక్షలు ఆశాజనకంగానే రాసినప్పటికి, ఫలితాలు రావడానికి కేవలం మూడు రోజుల ముందే,” ఫెయిల్ అవుతానేమో” అనే ఆందోళన అక్షాంత్‌ను తీవ్రంగా వెంటాడింది.
ఆ భయాన్ని తట్టుకోలేక ఫలితాలకు మూడు రోజుల ముందే అతను రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, ఆ గ్రామం అంతా ఇంకా ఆ దుఃఖం నుంచి బయటపడనే లేదు. ఈ లోగా అక్షాంత్ మరణించిన మూడు రోజుల తర్వాత ఆదివారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో తాను 347 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. “మా బిడ్డ ఇంత మంచి మార్కులతో పాస్ అయ్యాడు… కానీ ఈ విషయం తెలిసేలోపే మమ్మల్ని వదిలిపోయాడు” అంటూ ఆ తలిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
భయం, ఆందోళనతో క్షణికావేశంలో దూరమైన తమ కుమారుడిని తలుచుకొని అతని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. “ఈ ఘటనతో రాపల్లి గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మండల వ్యాప్తంగా ఈ విషాద ఘటన చర్చనిఅంశంగా మారింది. ఈ విద్యార్థికి జరిగిన ఈ విషాద ఘటన… విద్యార్థుల్లో పెరుగుతున్న పరీక్షల ఒత్తిడిని స్పష్టంగా చూపిస్తోంది. పరీక్ష ఫలితాల కంటే జీవితం ముఖ్యమని, ఒక పరీక్షలో వచ్చిన మార్కులు భవిష్యత్తును పూర్తిగా నిర్ణయించవని నిపుణులు చెబుతున్నా ఇలాంటి విషాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
పిల్లలకు ఆత్మవిశ్వాసం కలిగించేలా మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని పలువురు విద్యావేత్తలు, మేధావులు సూచిస్తున్నారు. ఒక్క క్షణం ధైర్యం చేసి సానుకూల దృక్పథంతో ఆలోచించి ఉంటే..ఆ యమపాషాన్ని తప్పించుకొని తన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే దిశగా ఆ విద్యార్థి అడుగులు సాగేవని విద్యా వేత్తలు, మేధావి వర్గం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తలిదండ్రులకు కలిగిన దుఃఖం తీర్చలేనిదని విచారం వ్యక్తం చేస్తున్నారు.
