ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎస్.ఎస్.సి ,ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించినట్లు జిల్లా విద్యాధికారి అశోక్ కుమార్ తెలిపారు. ఈ సమావేశం శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా డీఆర్‌డీఏ పీడీ మాట్లాడుతూ జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.
ఓపెన్ స్కూల్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షల సమయంలో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే కేంద్రాల వద్ద రవాణా, వైద్య సేవలు, పోలీస్ భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షలు నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఎం & హెచ్‌వో, డీఐఈఓ, ఆర్‌ఎం ఆర్టీసీ, ఎన్‌పీడీసీఎల్ సూపరింటెండెంట్, డీఎస్పీ, డీపీఆర్‌వో తదితర జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
